వికలాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలి

Reservation should be implemented for disabled persons– వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్ష కార్యదర్శులు ప్రకాష్, ఉపేందర్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ ఎంఎస్ఎంఈ-2024 పాలసీలో వికలాంగులకు 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, 2016 ఆర్పిడి   చట్టానికి భిన్నంగా పాలసీ ఏర్పాటు చేయడం సరైంది కాదని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుర్పంగ ప్రకాష్, వనం ఉపేందర్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టరేట్ పరిపాలనాధిక వారికి జగన్మోహన్ ప్రసాద్ కి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు-2024పేరుతో పాలసీ ప్రకటించడం జరిగిందనారు.  4000 కోట్లు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందనీ, 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ప్రభుత్వ పథకాల్లో వికలాంగులకు 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.
ఎస్సీ లకు 14.94 శాతం, ఎస్టీ లకు 8.75 శాతం,ఓబిసి లకు 27.69 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని పాలసీలో ప్రకటించారనీ,  వికలాంగులకు ఇవ్వవలసిన 5 శాతం రిజర్వేషన్స్ పాలసీలో ఎందుకు ప్రకటించలేదనీ ప్రశ్నించారు. దళిత, గిరిజన, మహిళల అభివృద్ధి గురించి మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం 43.02 లక్షల మంది ఉన్న వికలాంగుల అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడడం లేదనారు. వికలాంగులలో నైపుణ్య అభివృద్ధి కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలనీ,  వికలాంగులకు భాగస్వామ్యం లేకుండా పాలసీ ఏర్పాటు చేయడం అంటే వికలాంగుల పట్ల వివక్షత పాటించడమే అవుతుందనారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం  ఎం ఎస్ ఎం ఈ  -2024 పాలసీని సవరణ చేసి వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. లేని యెడల పెద్ద ఎత్తున  ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమములో జిల్లా కోశాధికారి కొత్త లలిత, మండల నాయకులు శ్రీహరి పాల్గొన్నారు.