నిరుపయోగ తీర్మానం

Resolution of Uselessnessగాజాపై ఇజ్రాయిల్‌ మారణకాండ ప్రారంభమైన నలభై రోజుల తరు వాత తొలిసారిగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మానవతా పూర్వక కోణంలో దాడులను ఆపాలని యూదు దురహంకారులను కోరుతూ 12-0 ఓట్లతో వేడుకోలు తీర్మానాన్ని ఆమోదించింది. అనేక దఫాల చర్చల అనంతరం మాల్టా ప్రతిపాదించిన ఈ తీర్మానంలో హమస్‌ను ఖండించ లేదు గనుక తాము బహిష్కరించినట్లు అమెరికా, బ్రిటన్‌ ప్రకటించాయి. ఇజ్రాయెల్‌ను డిమాండ్‌ చేయకుండా వేడుకోవటం ఏమిటంటూ రష్యా నిరసనతో ఓటింగ్‌కు దూరంగా ఉంది. ప్రపంచంలో లక్షలాది మంది ప్రతి రోజూ ఏదో ఓ మూల నిరసన తెలుపుతున్నా, ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానం చేసినా పెడచెవిన పెట్టిన ఇజ్రాయిల్‌ ఈ తీర్మానాన్ని మన్ని స్తుందా! వెనక్కు తగ్గుతుందా ? గాజాలోని ప్రధాన ఆసుపత్రి కింద నేలమాళిగల్లో దాక్కున్న హమస్‌ తీవ్రవాదులను పట్టుకొనే పేరుతో మొత్తం ఆసుపత్రినే పనికి రాకుండా చేసిన ఇజ్రాయిల్‌ మిలిటరీ అక్కడ ఎంతమంది తీవ్రవాదులను పట్టుకున్నదీ చెప్పకుండా ఆయుధాలను కనుగొన్నామంటూ లోకాన్ని నమ్మింపచేసేందుకు కొన్ని ‘సిత్రాలను’ చూపుతున్నది. ఇలాంటి ఫేక్‌ వీడియోలు ఎక్కడైనా తయారు చేయవచ్చు, తాన అంటే తందాన అనే బిబిసి లాంటి టీవీలు అవి నిజమే అంటూ ప్రపంచాన్ని నమ్మించేందుకు నానా గడ్డీ కరవవచ్చు తప్ప లోకజ్ఞానంతో ఆలోచించే వారెవరూ నమ్మరు. నివాస ప్రాంతాలు, జనాన్ని మానవ కవచాలుగా వాడుకుంటున్న ఉగ్ర వాదులు అంటూ ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేం దుకు పెద్దఎత్తున ప్రచారం సాగుతున్నది. గాజా ప్రాంతంలో సొరంగాలు ఉన్న అంశం కొత్తేమీ కాదు. వాటిపైన ఆసుపత్రులు, స్కూళ్లు, నివాసాలు, ఫ్యాక్టరీలు అన్నీ ఉన్నాయి. యూదు దురాక్రమణను ఎదిరించేందుకు పాలస్తీనా పోరాట యోధులు హమాస్‌ ఆవిర్భవించక ముందు కొన్ని దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేసుకున్నారు. అవి వారి పోరుబాటలో విడదీయలేనివిగా మారాయి. అక్కడేమీ అడవులు, ఎడారులు లేవు. అక్కడే నివాసాలు, అవే పోరాట కేంద్రాలు. అక్కడ పుట్టి పెరిగే ప్రతి బిడ్డా అక్షరాభ్యాసంతో పాటు పోరుబాట పాఠాలు కూడా నేర్చుకోక తప్పని స్థితిని సామ్రాజ్యా వాదులు, వారి బంటుగా ఉన్న ఇజ్రాయిల్‌ కల్పించిన కఠిన సత్యాన్ని ఎవరూ విస్మరించకూడదు. నిత్యం ఎప్పుడేమౌతుందో ఇజ్రాయిల్‌ పోలీసు, మిలిటరీ, యూదు ఉగ్రవాదులు ఎప్పుడు దాడులు చేస్తారో తెలియని స్థితిలో కార్చటానికి కన్నీళ్లు కూడా లేకుండా దశాబ్దాల తరబడి పెరిగారు, అక్కడే మట్టిలో కలిశారు. ఇప్పుడు ఈజిప్టు నేతలు అమెరికా చంకనెక్కి ఇజ్రాయెల్‌తో సఖ్యంగా ఉంటున్నారు తప్ప గతంలో అధికారంలో ఉన్నవారి ప్రోత్సాహం, సాయంతోనే పాలస్తీనా వారు సొరంగాలను ఏర్పాటు చేసుకు న్నారు. ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదిరిన తరువాత తమ భూభాగంలో ఉన్న వాటిని ఈజిప్టు కొన్నింటిని కూల్చివేసి, మూసివేసి, గోడలు కట్టి పాలస్తీనియన్లను రాకుండా కట్టడి చేసింది.
నెలరోజులకు పైగా టాంకులు, క్షిప ణులతో ఒక్కో ఆసుపత్రిని ధ్వంస చేస్తున్న పూర్వరంగంలో ఒకవేళ నిజంగానే తీవ్ర వాదులు ఎవరైనా ఆ సొరంగాల్లో ఉంటారా, ఇజ్రాయిల్‌, పశ్చిమదేశాల మీడియాలో చూపేందుకు ఆయు ధాలను అక్కడే వదలి వెళతారా? 1967 యుద్ధంలో ఈజిప్టు రక్షణలో ఉన్న గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ ఆక్రమించింది. ఓస్లో ఒప్పందాల్లో భాగంగా 1993లో పాలస్తీనా అధారిటీకి వాటిని అప్పగించినట్లు ప్రకటించినప్పటికీ 2005లో మాత్రమే సైన్యాన్ని, అక్కడ నివాసాలు ఏర్పాటు చేసి ప్రవేశ పెట్టిన యూదు పౌరులను వెనక్కు తీసుకుంది. ఆ తరువాత కూడా ఈజిప్టు పాలకులతో చేతులు కలిపి గాజాను దిగ్బంధం చేసింది, హమస్‌ తీవ్రవాదులను అణచేపేరుతో అనేక సార్లు గాజా మీద దాడులు చేసి వేలాది మందిని బలి తీసుకుంది. తాజాగా అదే సాకుతో చేస్తున్న దాడులు మరింత దుర్మార్గంగా ఉన్నాయి, ఆసుపత్రు లను కూడా వదల్లేదు. భద్రతా మండలి తీర్మానం భాషలో తొలుత కాల్పుల విరమణ పాటించాలనే డిమాండ్‌ను పెట్టగా తరువాత దాన్ని తొలగించి పిలుపు అనే పదాన్ని చేర్చారంటేనే దాన్ని ఇజ్రాయిల్‌ దయా దాక్షిణ్యాలకు వదలిపెట్టారన్నది స్పష్టం. కాదని ఠలాయిస్తే మీద చర్యలు తీసుకొనేందుకు ఎలాంటి ప్రతి పాదనలూ దానిలో లేవు. గతంలో బాల్కన్‌ నుంచి సిరియా వరకు అనేక సందర్భాల్లో ఇలాంటి వాటిని ఆమోదించారు. వాటిని పట్టించుకున్న వారుగాని, ఎలాంటి ఫలితంగాని లేదు. సరిగ్గా ఈ తీర్మానం ఆమోదిస్తున్న తరుణంలోనే గాజాలో పోరు తరువాత బలమైన మిలిటరీ శక్తిని అక్కడ ఉంచుతాం అని ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు ఇసాక్‌ హర్‌జోగ్‌ చెప్పాడు. ఇదే సమయంలో గాజాను ఆక్రమించటం పెద్ద తప్పిదం అవుతుందని స్పష్టం చేసినట్లు అమెరికా అధినేత జోబైడెన్‌ కొత్త పల్లవి అందుకొని నాటకంలో మరో అంకానికి తెరలేపాడు.