ఫలించిన రేవంత్‌, కోదండరామ్‌ల చర్చలు

Revanth and Kodandaram's negotiations resulted– పరిపాలనలో భాగస్వామ్యం కల్పిస్తామన్న కాంగ్రెస్‌ కలిసి పని చేస్తాం
– ఫలించిన రేవంత్‌, కోదండ రామ్‌ల చర్చలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌, టీజేఎస్‌ మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. ఆ రెండు పార్టీలు పొత్తుతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. కాంగ్రెస్‌ అధికారం లోకి వస్తే ప్రొఫెసర్‌ కోదండరాంకు, తెలంగాణ ఉద్యమ అనుచరులకు సముచిత స్థానం కల్పించ నున్నట్టు కాంగ్రెస్‌ తెలిపింది. గత కొంత కాలంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్‌ మల్లు రవి, టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాంతో చర్చలు జరుపు తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోమ వారం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మానిక్‌ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, నాయ కులు బోసురాజు, వేం నరేందర్‌రెడ్డి తదితరులు హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. అనంతరం వారు కోదండరాంతో పాటు ఆ పార్టీ ఉపాధ్యక్షులు పీ.ఎల్‌.విశ్వేశ్వర్‌ రావులతో చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం, ప్రజా పరిపాలన నెలకొల్పడానికి మద్ధతివ్వాలని టీజేఎస్‌ను కోరారు. తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి లక్ష్యసాధన దిశగా ఉద్యమాలను నిడిపిన కోదండరామ్‌, తన అనుభ వాన్ని కేసీఆర్‌ నిరంకుశ పాలన అంతమొందించడా నికి,స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి సాధన కోసం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
కోదండరాం మాట్లాడుతూ కేసీఆర్‌ నిరంకుశ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్‌ పార్టీకి మద్ధతిస్తున్నట్టు ప్రకటించారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక విధాన రూపకల్పనలో ఆరు అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. అందరికి నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించా లనీ, ఉపాధి, ఉద్యోగాల కల్పన ప్రధాన లక్ష్యంగా ఆర్థిక విధానాల రూపకల్పన జరగాలని ఆకాంక్షిం చారు. ఏ ఏడాది ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను అదే ఏడాది క్యాలెండర్‌ ప్రకారం భర్తీచేయాలనీ, స్థానిక ప్రయివేట్‌ పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో భూమి పుత్రులకు అవకాశాలు కల్పించాలన్నారు.
వాస్తవ సాగుదారులందరికీ, ప్రత్యేకించి చిన్న, సన్న, కౌలు రైతుల ఆదాయ భద్రత సాధించడంతో పాటు వీరి భూమి హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రాజ్యాంగ ప్రాతిపదికన ప్రజాస్వామిక పాలనను నెలకొల్పాలనీ, కేసీఆర్‌ అవినీతి చర్యలపైన విచారణ జరపాలనీ, పౌరులంద రికి ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు, మైనార్టీలకు, పేద వర్గాలకు పాలనలో భాగస్వామ్యం కల్పిస్తూ వారి సంక్షేమం కోసం విధానాలు రూపొం దించాలన్నారు. అభివృద్ధి ఫలితాల్లో న్యాయమైన వాటా దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేయాలనీ, అమరుల కుటుంబాలకు సమగ్రమైన సహాయాన్ని అందించాలని కోరారు.
కోదండరాంకు సముచిత స్థానం
పాలనలో కోదండరాంకు సముచిత స్థానం కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి తెలి పారు. చర్చల అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ పాలనను అంతమొందించడమే రెండు పార్టీల లక్ష్యమని స్పష్టం చేశారు. పొత్తు,సీట్లకు సంబంధిం చిన అన్ని విషయాలను అధిష్టానానికి నివేదిస్తామని తెలిపారు. కోదండరాం రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది అభిమానించే నాయకుడని కొనియాడారు. కోదండరాం మాట్లాడుతూ కేసీఆర్‌ నియంత పాలన అంతం కావడంతో పాటు ప్రజాస్వామిక పాలన రావాలని ఆకాంక్షించారు.