కేవైసీ నిబంధనలు సమీక్షించండి

– కేంద్రమంత్రికి రాష్ట్ర మంత్రి గంగుల లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆహార భద్రతా కార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కేవైసీ నిబంధనల్ని సమీక్షించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌కు లేఖ రాసారు. కేవైసీ నిబంధనల వల్ల నష్టపోతున్న తెలంగాణ పౌరుల ప్రయోజనాలను పరిరక్షించాలని కోరారు. దేశం మొత్తం పరిస్థితులకు, తెలంగాణ పరిస్థితులకు వైవిధ్యం విభిన్నమైనదనీ, ఇక్కడి ప్రజలు సరైన ఉఫాది లేక పెద్ద సంఖ్యలో గల్ఫ్‌, ఇతర దేశాలతో పాటు దేశంలోని ముంబై, బీవండి తదితర ప్రాంతాలకు పెద్ద ఎత్తున వలసలు వెళ్లారని పేర్కొన్నారు. దీన్ని సరిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తుందనీ, కానీ స్వల్ప వ్యవధిలో పరిస్థితుల్ని పూర్తిగా మార్చలేమని చెప్పారు. ఇప్పుడిప్పుడే వలసలు వెళ్లిన ప్రజలు తిరిగి స్వరాష్ట్రానికి వస్తున్నారనీ, ఇంకా అనేక మంది తెలంగాణ రాష్ట్రం ఆవలే జీవనభృతి కొనసాగిస్తున్నారని వివరించారు. ఆహార భద్రతా కార్డుల కోసం కేంద్ర ప్రభుత్వ కేవైసీ నిబంధనల వల్ల వలసలు వెళ్లిన ప్రజల హక్కులు కోల్పోతున్నారని తెలిపారు. ప్రవాస తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి మానవీయ దక్పథంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కచ్చితంగా పున:సమీక్షించాలని కోరారు. ప్రస్తుత కేవైసీ నిబంధనల వల్ల దూరప్రాంతాల నుంచి తెలంగాణ ప్రజానీకం రాలేకపోతున్నారని తెలిపారు. కేవైసీపై ఎవరూ ఆందోళనలకు గురికావద్దని సూచించారు.