– వెంటనే జీవోలు జారీ చేయండి
– లేబర్ కమిషనర్ నదీమ్‌కు కార్మిక సంఘాల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని 73 షెడ్యూల్ ఎంప్లారుమెంట్స్‌లో వేతనాలు సవరించా లనీ, వెంటనే జీవోలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని అంజయ్య భవన్‌లో కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్‌కు వారు వినతిపత్రాన్ని ఉమ్మడిగా అందజేశారు. కార్యక్రమంలో జె.మల్లిఖార్జున్(సీఐటీయూ), బాల రాజు (ఏఐటీయూసీ), విజయకుమార్(ఐఎన్‌టీయూసీ), సూర్యం (ఐఎఫ్ టీయూసీ), ఎమ్‌కే బోస్(టీఎన్‌టీయూసీ), తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనాలను చట్ట ప్రకారం ప్రతి ఐదేండ్లకోసారి సవరించాలని గుర్తుచేశారు. కార్మిక శాఖ అలా చేయకపోవడం వల్ల రాష్ట్రంలో కోటి మందికిపైగా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కాలంలో నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులు విపరీతంగా పెరిగాయనీ, దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని వాపోయారు. వేతనాలను ప్రభుత్వం నిర్ణయించకపోవడం వల్ల పరిశ్రమల యజమానులు విపరీతంగా లభాలు పొందుతున్నారన్నారు. 2021 జూన్‌లో ఐదు రంగాలకు సంబంధించి జీవో నెంబర్ 21,23,24,25 ఫైనల్ నోటిఫికేషన్స్ ఇచ్చారనీ, వాటిలో అన్‌స్కిల్డ్ కార్మికులకు మినిమం బేసిక్‌గా రూ.18,019, వీడీఏ రేటు రూ.12గా నిర్ణయించారని చెప్పారు. ఆపై సెమీస్కిల్ద్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ వర్కర్లకు వేతనాలు పెంచుతూ నిర్ణయం జరిగిందన్నారు. స్టేక్ హౌల్డర్స్ మీటింగ్‌లో ఐదు జీవోలనూ గెజిట్ చేయాలని కార్మిక సంఘాలు ముక్త కంఠంతో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా కనీసవేతనాలను సవరించాలని కోరారు.