ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ చేయాలి

– గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి
– 30న ఇందిరాపార్కు వద్ద సామూహిక నిరాహారదీక్ష : కె.రాజిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ చేయాలనీ, సంస్థలో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరారు. ఇవే డిమాండ్లపై ఈ నెల 30న ఇందిరాపార్కు వద్ద ఈయూ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2019 అసెంబ్లీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయాల్లో వేతన సవరణలు చేస్తామని రాష్ట్ర సర్కారు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచడానికి మునుగోడు ఉప ఎన్నిక కోడ్‌ అడ్డుగా ఉందనీ, కోడ్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈసీకి రాష్ట్ర సర్కారు లెటర్‌ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా వేతన సవరణ చేస్తామని కార్మికులకు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు హామీనిచ్చారని తెలిపారు. ప్రభుత్వమిచ్చిన హామీల విస్మరణపై హైకోర్టులో తాము పిటిషన్‌ వేయగా..సంస్థలో 3 నెలల్లోగా గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. 2017,2021 వేతన సవరణ పేస్కేల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అమలు చేయాలని కోరారు. సీసీఎస్‌కు డబ్బులు చెల్లించాలనీ, బడ్జెట్‌లో ఆర్టీసీకి 2 శాతం నిధులు కేటాయించాలని కోరారు. 2013 వేతన సవరణకు సంబంధించిన ఏరియర్స్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులపై ఉన్నతాధికారులు వేధింపులకు అడ్డుకట్ట వేయాలని కోరారు. 30న జరిగే సామూహిక నిరాహార దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.