నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వచ్చేనెల ఎనిమిదిన అఖిల భారత విప్లవ విద్యార్థుల సమ్మేళనం ఢిల్లీలో జరగనుంది. అందుకు సంబంధించిన గోడపత్రికను శుక్రవారం హైదరాబాద్‌లో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరశురాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విద్యారంగం, న్యాయమైన ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తున్న 16 విద్యార్థి సంఘాలు కలిసి మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈనెల ఎనిమిదిన ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద భారీ ప్రదర్శన, సభను నిర్వహిస్తామని చెప్పారు. పలువురు ప్రొఫెసర్లు, ప్రజాస్వామికవాదులు పాల్గొని ప్రసంగిస్తారని అన్నారు. అనంతరం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. అసమానతల్లేని సమాజం కోసం, శాస్త్రీయ విద్య సాధనే లక్ష్యంగా చేసుకుని సమరశీల పోరాటాలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు రియాజ్, గణేష్, నాగరాజు, హైదరాబాద్ నాయకులు నవీన్, శ్యామ్, యశ్వంత్‌రెడ్డి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.