– ప్యూడల్ వ్యవస్థపై ఆమెదో ఉక్కుపాదం..
– జాగిర్దర్ల దౌర్జన్యాలపై పెను ఉప్పెన!
– రజాకార్ల రాక్షసత్వాన్ని సహించలేమని హెచ్చరించింది..
– పదహారేండ్ల వయసులోనే బంధూక్ చేతపట్టింది..
– తెలంగాణ సాయుధపోరాటంలో అగ్నికణికై నడిచింది..
– పేదల గుండెల్లో చిరస్మరణీయురాలిగా నిలిచింది..
అమ్మ.. మల్లు స్వరాజ్యం.. మార్కిస్టు యోధురాలు. పీడిత ప్రజల గొంతుక,హక్కుల గళం, పోరాట స్ఫూర్తి. భూమి, భుక్తి, విముక్తి కోసం చేసిన పోరాటం మహాత్తరమైనది. తొంబై పదుల వయసులోనూ ఆమె చూపిన చైతన్యం మరువ లేనిది… ఆమె మననుంచి దూరమై ఏడాది అవుతున్నా నేడు సాగుతున్న కార్మిక, ప్రజా వ్యతిరేక ఉద్యమాల్లో, పోరాటాల్లో ‘ఆమె మాట నేటికీ తుపాకీ తూటే’. ఉమ్మడి నల్లగొండ జిల్లా(నేటి సూర్యపేట) తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో 1931లో ఓ భూస్వామ్య కుటుంబంలో ఆమె జన్మించారు. ”పువ్వు పుట్టగానే పరిమళించు” అన్నట్లు ఆమె చిన్ననాడే పోరాట పంథాను ఎంచుకున్నారు. చిన్నతనంలో కమ్యూనిస్టు భావాలు అలవర్చుకొని దోపిడీకి వ్యతిరేకంగా, తన సొంత గ్రామంలో గ్రామ పటేళ్ళను, పెత్తందార్లను ఎదిరించి పాలేర్ల సంఘం పెట్టారు. కూలిరేట్ల ఉద్యమంతో ప్రారం భమైన ఆమె విప్లవ జీవితం ఎనిమిది దశాబ్దాలపాటు ఏనాడూ వెనుదిరగలేదు.ఈ ప్రయాణంలో ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ఎదుర్కొన్నారు. మొక్కవోని ధైర్యంతో అన్న భీంరెడ్డి నర్సింహ్మారెడ్డి (బి.యన్.) అడుగుజాడల్లో ముందుకు నడిచారు. పోరాటమే ఆయుధంగా గెరిల్లా దళాల్లో చేరి దొరల దుర్మార్గాలను ఎదు ర్కొంటూ నైజాం రజాకార్ల పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు.
సాయుధ పోరాటంలో బంధూక్ చేతపట్టి…
తెలంగాణలో వెట్టిచాకిరీ రద్దు చేయాలని, దున్నేవానికి భూమి కావాలని, నైజాం నవాబు గద్దె దిగాలనే నినాదాలతో సాగిన మహాత్తర సాయుధ పోరాటం, ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినది. అందులో మల్లు స్వరాజ్యం బంధూక్ చేతపట్టి ముందు వరుసలో నిలిచి మనందరికీ స్ఫూర్తినిచ్చారు. ఆ సాయుధ పోరాట ఫలితంగా తెలంగాణలో 3వేల గ్రామాల్లో గ్రామరాజ్యాలు ఏర్పడ్డాయి. 10లక్షల ఎకరాల భూములు పేదలకు పంపిణీ చేశారు. భూస్వాముల భూములు, గడీలు ప్రజల స్వాధీనమైనవి. వెట్టి చాకిరి రద్దయింది, వడ్డీ వ్యాపారం అక్రమ బేదఖళ్ళు నిలిపి వేయబడ్డాయి, వ్యవసాయ కూలిరేట్లు పెంచబడ్డాయి. 4 వేల మంది వీరమరణం పొందారు. గ్రామాలను గ్రామరైతు కమి టీలు పరిపాలించారు. నైజాం రజాకార్ల బారి నుండి రైతాంగాన్ని రక్షించుకొనేందుకు 10 వేల మంది గ్రామ రక్షక దళాలు 2 వేల మంది గెరిల్లా సాయుధ దళాలు నిర్మించారు. ఫలితంగా సాగిన పోరాటంలో మధ్య యుగాల నాటి నైజాం నవాబు పాలన అంతమొందింది. కమ్యూనిస్టుల నాయకత్వాన సాగిన సాయుధ రైతాంగ పోరాటం అనేక విజయాలు సాధించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా భూసంస్కరణ చట్టం వచ్చింది. కౌల్దారీ చట్టం, పౌరహక్కులు వచ్చాయి, ప్రజలకు స్వేచ్చా స్వాతంత్య్రాలు లభించాయి. ఈ చారిత్రక పోరాటంలో స్వరాజ్యం పాత్ర అద్వితీయం అజరామరం.తెలంగాణలోనే కాదు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అనేక సమరశీల ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ప్రజాపోరాటాలతో పాటు సామాజిక ఉద్యమాల్లో తనదైన పాత్ర పోషించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో దళ కమాండర్‌గా పని చేశారు. కులవివక్షతను నిర్మూలిం చాలని, సారా వ్యతిరేక ఉద్యమం,సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం, చట్టసభల్లో, మహిళలకు రిజర్వేషన్ కావాలని, ఆడపిల్లల అమ్మకాలు అరికట్టాలని, మహిళలపై జరుగు తున్న హత్యలు, లైంగికదాడులు అరికట్టాలని, మహిళలకు రక్షణ కల్పించాలని, సాగిన అనేక పోరాటాల్లో ఆమె చట్టసభల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ తన గళాన్ని విప్పి ప్రజల్ని పోరాట మార్గానికి నడిపించిన గొప్ప ఉద్యమకారిణి కామ్రేడ్ మల్లు స్వరాజ్యం.
ఆమె మాటే..తుపాకి తూటా…
మల్లు స్వరాజ్యం వ్యక్తి కాదు ఆమె ఒక మహాశక్తి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మార్క్సిస్టు పార్టీ ఉద్యమానికి అండదండలిచ్చి, కార్యకర్తలను అక్కున చేర్చుకొని కాపాడటంలో ఎనలేని కృషి చేశారు. మార్క్సిస్టు పార్టీ ఉద్యమంపై, కార్యకర్తలపై నాడు పాలకపార్టీ గుండాలు హత్యల పరంపర కొనసాగు తున్న రోజుల్లో కార్యకర్తలకు అండగా నిలబడి ధైర్యాన్నిచ్చిన ఘనత్వ స్వరాజ్యంది. మిర్యాలగూడెం ప్రాంతంలో రాగిరెడ్డి వీరారెడ్డి, గాదె శ్రీనివాసరెడ్డి, పొనుగోడులో అందె నర్సయ్య, సుందరి బసవయ్య, మల్లారెడ్డిగూడెం కందుల గుర్వారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, యాతవాకిల్లలో పున్నంరాజు, మునగాలలో ముదిరెడ్డి ఆదిరెడ్డి, సూర్యాపేటలో ధనియాకుల గుర్వయ్య హత్యలతోపాటు సూర్యాపేట, తుంగతుర్తి, పుట్టపాక లాంటి అనేక గ్రామాల్లో, ఉద్యమ కేంద్రాలపైన దాడులు జరిగినప్పుడు ఆ కేంద్రాలకు అం డనిచ్చి వారి కుటుంబాలకు మనోధైర్యాలను నింపటంలో ఆమె కృషి మరవలేనిది. పాలకపార్టీల అండతో పోలీసులు ఉద్యమ కేంద్రాలపై దాడులు చేసినప్పుడు, పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి, చిత్రహిం సలకు గురిచేసినప్పుడల్లా ఆమె గళమెత్తితే పాలక వర్గాలకు, పోలీసులకు వెన్నులో వణుకు పుట్టేది. స్వరాజ్యం ఏ సభలో పాల్గొన్నా, ఆమె ప్రసంగం కోసం ప్రజలు గంటల తరబడి ఎదురు చూసేవారు, కేరింతలు కొట్టేవారు.
ఆదర్శ వివాహం.. విప్లవ ప్రయాణం..
విప్లవోద్యమంలో పనిచేస్తున్న తరుణంలో సాయుధ పోరులో సహచరుడైన వి.యన్.తో పార్టీ పెద్దల సమక్షంలో 1954లో హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దండలు మార్చుకొని ఆదర్శ వివా హం చేసుకున్నారు. నాటి నుండి వి.యన్. ఆలోచన, స్వరాజ్యం ఆచరణ యావత్ ప్రజా ఉద్యమాలను ప్రభావితం చేసింది. మల్లు స్వరాజ్యం దంపతులు మార్క్సిస్ట్ మహౌద్య మంలో మడమ తిప్పని మహాయోధులుగా ఐదు దశాబ్దాల పాటు విప్లవ జీవితం గడిపారు. తుంగతుర్తి శాసన సభ్యురాలిగా, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలిగా, మహిళా సంఘం ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తూ అనేక పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులు నేటికి విప్లవ రాజకీయాలతో పెనవేసుకుని ఉన్నారు. అణగారిన ప్రజల కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. మల్లు స్వరాజ్యం విప్లవజీవితం, చేసిన పోరాటం నేటితరానికి ఆదర్శ నీయం..ఆమె చూపిన ఎర్రబాటలో సాగుదాం.. అమ్మ ఆశయ సాధనకు పునరంకి తమవుదాం…
(నేడు మల్లు స్వరాజ్యం ప్రథమ వర్థంతి)
– ఎం. రాములు
9490098338