వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయాలి

– వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ అధికారులకు కలెక్టర్‌ ఆదేశం
నవ తెలంగాణ- వనపర్తి
వానాకాలం వరి ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద లాల్‌ పవార్‌ ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం ఐ.డి. ఒ.సి ప్రజావాణి హాల్లో వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ఐ.కే.పి., పి. ఎ.సి.ఎస్‌ వరి ధాన్యం కొనుగోలు ఇంఛార్జి లు, వ్యవసాయ శాఖ అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. త్వరలో రైతులు వరి కోతలు ప్రారంభం అవుతాయని, రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. ఈ సారి ఎ గ్రేడ్‌ రకం వరికి క్వింటాలుకు రూ. 2203/- లు సాధారణ రకం ధాన్యానికి రూ. 2183/- ఇవ్వడం జరిగిందన్నారు. వానాకాలం సాగు ద్వారా జిల్లాలో 4.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేయడం జరిగిందన్నారు. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అయితే అందుకు ఒక ప్రణాళిక ఉండాలని సూచించారు. ఐ.కే.పి., సహకార సంఘం ద్వారా జిల్లాలో సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వరి కోతను రైతులు అందరూ ఒకేసారి కాకుండా విడతలవారీగా వరికోత చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ విస్తిర్ణాధికారులను సూచించారు. ముందు కోత చేసే వారికి ముందుగా టోకన్‌ లు ఇవ్వాలని తెలిపారు. ధాన్యం లారీని ఏ మిల్లుకైతే ముందుగా ట్యాగింగ్‌ చేశారో అదే మిల్లుకు వెళ్ళాలని అలా కాకుండా వేరే మిల్లుకు వెళితే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తేమ శాతం కొలిచే యంత్రాలు, టార్పలిన్‌ లు, గన్ని బ్యాగులు, రైతులకు తాగునీరు, మరుగుదొడ్లు, వంటి సౌకర్యాలు ఉండాలని ఆదేశించారు. ఏరోజుకు ఆరోజు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఒ.పి.యం.ఎస్‌ ఆన్లైన్లో అప్లోడ్‌ చేయాలని, తద్వారా రైతులకు డబ్బులు సకాలంలో అందేవిధంగా వీలు ఉంటుందన్నారు. తాలు ఎక్కువగా ఉండకుండా వరి ధాన్యాన్ని తూర్పారబెట్టడం, యంత్రాల ద్వారా కోత చేసేటప్పుడు ఫ్యాన్‌ విధిగా నడిపించడం , ఎండలో ఆరబెట్టడం జరిగేవిధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. తేమ శాతం 17 కు మించకుండా బాగా ఆరబెట్టిన ధాన్యం తీసుకురావాలని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టపోకుండా ఉండేందుకు ధాన్యం కోనుగొలు కేంద్రం లోతట్టు ప్రాంతం లో కాకుండా ఎత్తైన , చదునైన ప్రాంతం లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్‌ యస్‌. తిరుపతి రావు, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్‌, సివిల్‌ సప్లై అధికారి కొండల్‌ రావు, డీసీఓ. రఘునాథ రావు, జిల్లా మార్కెటింగ్‌ అధికారి ఎస్‌. స్వరన్‌ సింఫ్‌ు, అడిషనల్‌ డి. ఆర్‌.డి. ఒ రేణుక, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులు, ఐ.కే.పి కేంద్రాల ఇంఛార్జి లు, కోఆపరేటివ్‌ శాఖ కొనుగోలు కేంద్రాల ఇంఛార్జి లు తదితరులు పాల్గొన్నారు.