రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి

మాల్‌ నుండి మంతన్‌ గౌరెల్లి వరకూ
రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి
ఎంపీటీసీ కొర్ర జ్యోతి అరవింద్‌ నాయక్‌
నవతెలంగాణ-యాచారం
మంతన్‌ గౌరెల్లి పరిధిలో వరుసగా జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఆర్‌ అండ్‌ బి అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ కొర్ర జ్యోతి అరవింద్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. గురువారం యాచారం మండల పరిధిలోని మంతన్‌ గౌరెల్లి రోడ్డు పైన పడ్డ గుంతలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ బుధవారం రాత్రి ఓ ఇద్దరు వ్యక్తులు రాత్రి వేళలో రోడ్డు పైన ఉన్న గుంతలు కనిపించక తీవ్రంగా గాయపడ్డారని గుర్తు చేశారు. వారు హైదరాబాదులోని ఆరంజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని గుర్తు చేశారు. మాల్‌ నుండి మంతన్‌ గౌరెల్లి వైపు వచ్చే రోడ్డు మొత్తం ప్రమాదకరంగా మూల మలుపులు ఉన్నాయని తెలిపారు. కొత్త వ్యక్తులు ఈ రోడ్డు గుండా వస్తే ఏదో ఒకచోట ప్రమాదానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై గతంలో ఆర్‌ అండ్‌ బి అధికారులకు ఫిర్యాదు చేశామని వివరించారు. అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. మాల్‌ నుంచి మంతన్‌గౌరెల్లి వరకు రోడ్డు విస్తరణ పనులను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని కోరారు. గ్రామానికి వచ్చే దారిలో కలువట్టు ఎక్కువగా ఉండడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయని తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి చొరవ తీసుకొని రోడ్డు వెడల్పు పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. మంతన్‌ గౌరెల్లి గ్రామ ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఆర్‌ అండ్‌ బి అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించాలని ఎంపీటీసీ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.