నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రోహిణి కార్తెలో ఎండలు రోళ్లు పగిలేలా కొడుతున్నాయి. ఉదయం పది గంటలకే ఎండ భగభగ మండిపోతున్నది. దీనికి ఉబ్బరం తోడైంది. దీంతో ఇండ్లల్లో బండల వేడిమికి ఉండలేని పరిస్థితి ఉంటున్నది. ఉపశమనం కోసం ఉన్నోల్లు కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. లేనోళ్లు తమ ఇండ్ల ముందట ఉన్న వేప, ఇతర చెట్ల కింద సేదతీరుతున్నారు. లీటర్ల కొద్ది నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. పెద్దపల్లి జిల్లా ముత్తారంలో అత్యధికంగా 43.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. వచ్చే మూడు రోజులు పాటు ఎండల తీవ్రత నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీచేసింది. ఆ జాబితాలో ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలున్నాయి. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన వర్షం అక్కడక్కడా పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో గురువారం రాత్రి పది గంటల వరకు 17 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో అత్యధికంగా 2.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.