– రసవత్తరంగా హెచ్‌సీఏ ఎన్నికలు
– అధ్యక్ష రేసులో జగన్ ముందంజ
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఆఫీస్ బేరర్ల పదవులకు శుక్రవారమే ఓటింగ్ కావటంతో ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. నాలుగు ప్యానల్స్ హెచ్‌సీఏ ఎన్నికల బరిలో నిలువగా.. ప్రధానంగా పోటీ గులాబీ వర్సెస్ కమలంగా కనిపిస్తోంది. అధికార భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) మద్దతుతో జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం (హెచ్‌ఏఐ) ప్రధాన కార్యదర్శి అర్శినపల్లి జగన్‌మోహన్ రావు అధ్యక్ష పదవి కోసం వ్యూహాత్మకంగా పావులు కదుతుపున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన కీలక నేత, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి తన ప్యానల్‌ను రేసులో నిలిపారు. దీంతో హెచ్‌సీఏ ఎన్నికల్లో ఈ రెండు ప్యానల్స్ నడుమే ప్రధానంగా పోటీ కనిపిస్తుంది.
ముందంజలో జగన్! : హెచ్‌సీఏ అధ్యక్ష పదవి రేసులో జగన్‌మోహన్ రావు ముందంజలో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. శుక్రవారం జరుగనున్న ఎన్నికల్లో 173 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాధారణ మెజారిటీ సాధించేందుకు 87 ఓట్లు అవసరం. హెచ్‌సీఏ ఓటర్ల జాబితాలో 48 మంది ఇన్‌స్టిట్యూషన్స్, 9 జిల్లాల అసోసియేషన్లు, 15 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. ప్రభుత్వం సూచనల మేరకు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవటం ఇన్‌స్టిట్యూషన్స్‌కు సంప్రదాయంగా వస్తోంది. జిల్లా క్రికెట్ సంఘాలు సైతం అదే కోవలో ఉన్నాయి. ప్రభుత్వంలో ఇద్దరు కీలక మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, తన్నీరు హరీశ్ రావు సహా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండదండలు జగన్‌మోహన్‌రావుకు ఉన్నాయి. దీంతో 101 క్లబ్ సెక్రటరీలలో అధిక శాతం మంది జగన్ ప్యానల్‌తో టచ్‌లో ఉన్నారని సమాచారం. జాతీయ హ్యాండ్‌బాల్ సంఘంలో నిర్వవాద విజయాలు, ప్రభుత్వం అండతో హెచ్‌సీఏకు పూర్వ వైభవం తీసుకొస్తారనే అంశాలు జగన్‌మోహన్‌రావును రేసులో ముందంజలో నిలుపుతున్నాయి. మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్‌లు ఓ ప్యానల్‌తో ముందుకొచ్చినా.. ఏండ్లుగా ఏలుతున్న పెద్దలు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారనే పెదవి విరుపులు హెచ్‌సీఏ వర్గాల్లో వినిపిస్తున్నాయి!.