హైదరాబాద్‌లో ‘రూట్‌ పాస్‌’

– కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తింపు
– ఈ నెల 27 నుంచి అమల్లోకి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారిగా ‘జనరల్‌ రూట్‌ పాస్‌’కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) శ్రీకారం చుట్టింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాక పోకలకు వర్తించేలా రూట్‌ పాస్‌ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించి నెల రోజులకుగానూ ఆర్డినరీ రూట్‌ పాస్‌కు రూ.600, మెట్రో రూట్‌ పాస్‌నకు వెయ్యి రూపాయలుగా, ఐడీ కార్డుకు రూ.50గా నిర్ణయించింది. గురువారం ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్‌డీ వీసీ సజ్జనార్‌ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ రూట్‌పాస్‌ను ప్రయాణికులు ఆదరించాలని కోరారు. ఈ పాస్‌ కు సంబంధించిన రూట్ల వివరాల కోసం www.tsrtc.telangana.gov.in, https://online.tsrtcpass.in వెబ్‌సైట్లను సంప్రదిం చాలని సూచించారు. మొదటగా హైదరాబాద్‌లోని 162 రూట్లలో ఈ పాస్‌ను ప్రయాణికులకు ఇవ్వనుంది. ఈ రూట్‌ పాస్‌ దారులు 8 కిలోమీటర్ల పరిధిలో అపరిమితంగా ఎన్నిసార్లైన బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటును సంస్థ కల్పించింది. సెలువు దినాలతో పాటు ఆదివారాల్లోనూ ఈ పాస్‌తో ప్రయాణించవచ్చు. హైదరా బాద్‌లో ప్రయాణి కులకు ఇప్పటికే జనరల్‌ బస్‌ టికెట్‌ అందుబాటులో ఉంది. ఆర్డినరీ బస్‌ పాస్‌ కు రూ.1150, మెట్రో ఎక్స్‌ ప్రెస్‌ బస్‌ పాస్‌ కు రూ.1300గా ధర ఉంది. ఈ పాస్‌ దారులు సిటీ సబర్బన్‌ పరిధిలో తిరిగే అన్ని బస్సుల్లోనూ ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించ వచ్చు. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు మాత్రమే ఈ పాస్‌లను కొనుగోలు చేస్తున్నారని సంస్థ చేసిన సర్వేలో వెల్లడ యింది. స్వల్ప దూరం వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారులు బస్సుల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని తేలింది.