– మార్కెట్లను వెంటాడిన యుద్ధ భయాలు
– సెన్సెక్స్ 800 పాయింట్ల పతనం
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండో రోజూ యుద్ధ భయాలు కొనసాగాయి. ఇరాన్- ఇజ్రాయిల్ యుద్ధ భయాలు, చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం, విదేశీ మదుపర్లు తమ ఈక్విటీలను వెనక్కి తీసుకోవడం తదితర పరిణామాలు వారాంతంలోనూ మార్కెట్లను మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేశాయి. శుక్రవారం ఉదయం ఓ దశలో మార్కెట్లు పుంజుకున్నప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో తుదకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 809 పాయింట్లు లేదా 0.98 శాతం పతనమై 81,688కు పడిపోయింది. అదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 200 పాయింట్లు లేదా 0.79 శాతం నష్టంతో 25,050 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్ల లాభపడి 83,368 గరిష్టాన్ని తాకగా… మధ్యాహ్నం తర్వాత అమ్మకాల దెబ్బకు 81,533 కనిష్ఠాన్ని తాకింది. దీంతో వరుసగా ఐదో సెషన్‌లోనూ మార్కెట్లు నష్టాలు చవి చూసినట్లయ్యింది. వారాంతం సెషన్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌లో 2384 స్టాక్స్ క్షీణించగా.. 1564 సూచీలు లాభపడగా.. 106 షేర్లు యథాతథంగా నమోదయ్యాయి.
నిఫ్టీ 4.3 శాతం పతనం
ఈ వారంలో ఏ ఒక్క రోజూ సానుకూలత లేకపోవడంతో సెన్సెక్స్ 3,883 పాయింట్లు లేదా 4.5 శాతం క్షీణించగా.. ఎన్‌ఎస్‌ఈ 1,128 పాయింట్లు లేదా 4.3 శాతం పతనమయ్యింది. రిలయన్స్ ఇండిస్టీస్ షేర్ ఏకంగా 7.31 శాతం పతనమై రూ.2,771.50 వద్ద నమోదయ్యింది. ఒక్క వారంలోనే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 4 మధ్య బీఎస్‌ఈ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.16.67 లక్షల కోట్లు హరించుకుపోయి.. రూ.461.26 లక్షల కోట్లకు పరిమితమయ్యింది.
తరలిన రూ.30వేల కోట్ల ఎఫ్‌ఐఐలు
గడిచిన మూడు సెషన్లలో విదేశీ సంస్థాగత మదుపరు రూ.3.65 బిలియన్ డాలర్ల (రూ.30వేల కోట్లు పైగా) నిధులను తరలించుకుపోయారు. ఆర్థిక వృద్ధికి చైనా మరింత ఊతం ఇచ్చేలా ఇటీవల ప్రకటించిన విధానాలతో ఎఫ్‌ఐఐలు ఆ దేశం వైపు మొగ్గు చూపుతున్నాయి.