సింగరేణిలో రూ.55 లక్షల ఉచిత ప్రమాద బీమా

– యూనియన్‌ బ్యాంక్‌తో ఒప్పందం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాలరీస్‌ సంస్థలో సూపర్‌ శాలరీ అకౌంటు ఉన్న గల కార్మికులందరికీ రూ.55 లక్షల ఉచిత ప్రమాద బీమా వర్తించేలా ఆ సంస్థ యూనియన్‌ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది. ఉద్యోగి పదవీ విరమణ తర్వాత కూడా ఈ బీమా వర్తిస్తుంది. రూ.315 సాధారణ ఇన్సూరెన్స్‌ కడితే మరో రూ.30 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని ఆ సంస్థ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌ అండ్‌ పర్సనల్‌) ఎన్‌ బలరామ్‌ తెలిపారు. అలాగే గహ నిర్మాణం, విద్యా రుణాల్లోనూ రాయితీలు, ఉచిత చెక్‌బుక్‌, అపరిమిత ఏటీఎం సేవలు లభిస్తాయని వివరించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో ఆయన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ కారే భాస్కరరావుతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. యూనియన్‌ బ్యాంకు ఖాతాలు ఉన్న 11,182 మంది సింగరేణి కార్మికుల ఖాతాలను ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా సూపర్‌ శాలరీ అకౌంట్లుగా మార్చాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రతి కార్మికునికి ఉచితంగా రూ.55 లక్షల ప్రమాద బీమా సౌకర్యం లభిస్తుందన్నారు. నెలకు రూ.25 వేల నుంచి రూ.75 వేలు స్థూల జీతం పొందుతున్న ఉద్యోగులకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. సూపర్‌ శాలరీ అకౌంటు ఉన్నందుకు రూ.40 లక్షల ఇన్సూరెన్స్‌ పథకం, రూ.5 లక్షల బ్యాంక్‌ ఇన్సూరెన్స్‌, ఏటీఎం రూపే కార్డు ఇన్సూరెన్స్‌ ద్వారా రూ. 10 లక్షలు… మొత్తం రూ.55 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని వివరించారు. ఉద్యోగి రూ.315 సాధారణ ప్రమాద ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ కింద వార్షిక ప్రీమియం చెల్లిస్తే, ఆ పథకం కింద అదనంగా రూ.30 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. ఇటీవల మృతి చెందిన సింగరేణి కార్మికుల కుటుంబాలకు ఈ రెండు పథకాల కింద గరిష్టంగా రూ.78 లక్షలు చెల్లించినట్టు ఆయన తెలిపారు. ఈ స్కీం పదవీ విరమణ చేశాక 70 ఏండ్ల వయసు వచ్చే వరకు అమల్లో ఉంటుందన్నారు. కార్మికుల ప్రయోజనాలకు తమ సంస్థ తొలి ప్రధాన్యత ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సింగరేణి జనరల్‌ మేనేజర్‌ (వెల్ఫేర్‌ అండ్‌ రిక్రూట్‌మెంట్‌) కె. బసవయ్య, డైరెక్టర్‌ (పర్సనల్‌) ప్రకాశ్‌రావు, మేనేజర్‌ ముకుంద సత్యనారాయణ, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ పి. కష్ణన్‌, రీజనల్‌ హెడ్‌ డీ అపర్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.