రూ.9 లక్షల కోట్లు హాం ఫట్‌

9 lakh crores of ham fat– సెన్సెక్స్‌ 930 పాయింట్ల పతనం
– అన్ని రంగాలు నేల చూపులు
ముంబయి : అమ్మకాల వెల్లువతో దలాల్‌ స్ట్రీట్‌ మరోమారు కుప్పకూలింది. మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు ఒక్క శాతం పైగా విలువ కోల్పోయాయి. ఉదయం లాభాల్లోనే ప్రారంభమైన సూచీలు.. కాసే పట్లోనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. ఒక్క పూటలోనే ఇన్వెస్టర్ల సంపద రూ.9 లక్షల కోట్లు పైనా ఆవిరయ్యింది. ఇంట్రాడేలో 1000 పాయింట్లు పతనమై సెన్సెక్స్‌ తుదకు 931 పాయింట్లు క్షీణించి 80,221కి పరిమితమయ్యింది. అదే బాటలో ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 309 పాయింట్ల నష్టంతో 24,472 వద్ద ముగిసింది. నిఫ్టీ-50లో 47 స్టాక్స్‌ కూడా పతనాన్ని చవి చూడగా.. అన్ని రంగాలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి.
బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.9.34 లక్షల కోట్లు ఆవిరై రూ.444.31 లక్షల కోట్లుగా నమోదయ్యింది. సెన్సెక్స్‌-30లో మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, పవర్‌ గ్రిడ్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, లార్సెన్‌ అండ్‌ టర్బో, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. బీఎస్‌ఈలో 3428 స్టాక్స్‌ నష్టాలను చవి చూడగా.. కేవలం 559 స్టాక్స్‌ మాత్రమే రాణించాయి.
మరో 71 షేర్లు యధాతథంగా ముగిశాయి. స్మాల్‌ క్యాప్‌ 3.81 శాతం, మిడ్‌ క్యాప్‌ 2.52 శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీలో పీఎస్‌యూ, రియాల్టీ రంగాలు 4.2 శాతం, 3.3 శాతం చొప్పున క్షీణించాయి. ఆటో రంగాలు, మీడియా, కన్స్యూమర్‌ డ్యూరేబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాలు 2 శాతం పైగా నష్టపోయాయి.
తొలి రోజే హ్యుందారు షేర్లు ఢమాల్‌
దేశంలోనే రెండో అతిపెద్ద కార్ల కంపెనీ హ్యుందారు మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ తొలిరోజే ఇన్వెస్టర్లను నిరాశకు గురి చేసింది. ఇష్యూ ధరతో పోల్చితే 7 శాతం పతనమయ్యింది. రూ.27,870 కోట్ల నిధుల సమీకరణతో దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన ఈ కంపెనీ షేర్లు మంగళవారం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రూ.1,960 వద్ద లిస్టింగ్‌ అయినా హెచ్‌ఎంఐఎల్‌ షేర్‌ ఒక్క పూటలోనే రూ.140 లేదా 7.1 శాతం నష్టంతో రూ.1,820కు పడిపోయింది. ఇంట్రాడేలో రూ.1,807-1,970 మధ్య కదలాడింది. రూ.5వేల కోట్ల పైబడిన ఐపీఓల్లో హెచ్‌ఎంఐఎల్‌ ఐదో అత్యంత పేలవమైన లిస్టింగ్‌గా నమోదయ్యింది.