– రాష్ట్రవ్యాప్తంగా వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు బ్రేక్
– బుధవారం నాటి స్లాట్స్ నేటికి బదిలీ
– ఈవీ, ట్రాన్స్‌పోర్టు వెహికల్‌తో పాటు మిగతా సర్వీసులు యథాతధం
– ఇబ్బంది పడిన వాహనదారులు
– హర్డ్‌వేర్ సమస్యలే కారణమని ఆర్టీఏ వర్గాల వెల్లడి
నవతెలంగాణ-సిటీబ్యూరో
రవాణాశాఖలో మరోసారి సర్వర్ డౌన్ కావడంతో బుధవారం పౌర సేవలు పూర్తిగా స్తంభించాయి. సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక(హార్ట్‌వేర్) సమస్య కారణంగా ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆర్టీఏ వెబ్‌సైట్‌లో పాత, కొత్త వాహనాల వివరాలు కనిపించలేదు. దీంతో రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ ఆఫీసుల్లో వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించిన సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు వేల నూతన వాహన రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. ఈవీ, ట్రాన్స్‌పోర్టు వాహనాల రిజిస్ట్రేషన్, ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, తదితర మిగతా సేవలు యథావిధిగా కొనసాగాయని సంబంధిత అధికారులు చెప్పారు. బుధవారం ఉదయం ఉన్నట్టుండి సర్వర్లు డౌన్ కావడంపై ఆర్టీఏ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని ఆ వెంటనే చర్యలకు ఉపక్రమించారు. సాంకేతిక నిపుణుల సాయంతో సమస్యను పరిష్కరించారు. మధ్యాహ్నాం 2గంటల తర్వాత తిరిగి సేవలను అందుబాటులోకి తెచ్చారు. అప్పటికే ఆర్టీఏ కార్యాలయాల్లో వేచిచూస్తున్న వారికి సాయంత్రం అయిదు గంటల వరకు సేవలందించారు. మిగతా వారికి గురువారానికి అవకాశం కల్పించినట్టు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
సర్వర్‌లో సాంకేతిక సమస్య..
రవాణాశాఖ ఆన్‌లైన్ సేవల కోసం ఉపయోగించే సర్వర్‌లో తరుచుగా సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలోనూ అనేకసార్లు సర్వర్‌లో సమస్య కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ సేవలను నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి హార్డ్‌వేర్ సమస్య కారణంగా సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తడంతో ఒక్కసారిగా సేవలు నిలిచిపోయాయి. అయితే ఈసారి కేవలం వాహన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ప్రక్రియ వరకు మాత్రమే అంతరాయం ఏర్పడిందని, మిగతా సేవలు యథావిధిగా కొనసాగాయని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆ సమస్యను కూడా మధ్యాహ్నాం 2గంటల లోపే పరిష్కరించడంతో పాటు సాయంత్రం 5గంటల వరకు సేవలు అందించామని తెలిపారు. గురువారం నుంచి యథాతథంగా సేవలు అందుతాయని, బుధవారం రోజుకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి గురువారం యథావిధిగా సేవలు అందిస్తామని తెలిపారు.