ఆర్టీసీలో వేధింపులు పరాకాష్టకు…

– టికెట్లు తక్కువ అమ్మారంటూ కండక్టర్లపై ఒత్తిడి
– ఫ్లెక్సీల్లో ఫొటోల ముద్రణతో అవమానం
– మియాపూర్‌, మేడ్చల్‌ డిపోల ఎదుట ప్రదర్శన
– పెద్దఎత్తున విమర్శలు రావడంతో తొలగింపు
టీఎస్‌ఆర్టీసీలో కార్మికులపై వేధింపులు పరాకాష్టకు చేరాయి. కిలోమీటర్‌ ఫర్‌ అవర్‌ (కేఎమ్‌పీఎల్‌) తక్కువ తెచ్చిన డ్రైవర్లు, ఆదాయం తక్కువ తీసుకొచ్చిన కండక్టర్ల పేర్ల లిస్టును డిపో గేట్ల దగ్గర అంటించే స్థాయి నుంచి ఏకంగా ఫ్లెక్సీల్లో ఫొటోలు ముద్రించి నలుగురిలో అవమానానికి గురిచేసే దాకా ఆ పర్వం చేరుకున్నది. బస్సుల సంఖ్య తగ్గించడం, రూట్లలో సర్వీసులను కుదించడం వంటి చర్యలకు పాల్పడుతున్న ఆర్టీసీ యాజమాన్యం…ఆదాయం పడిపోవడానికి ఆ రూట్లలో పనిచేస్తున్న కార్మికులదే తప్పనట్టుగా వారిపై బదానం మోపుతూ క్షోభకు గురిచేస్తున్నది. ఫ్లెక్సీలు పెట్టించిన అధికారులపై కేసుల పెట్టాలనే డిమాండ్‌ ఊపందుకున్నది.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా ఇటీవల ప్రయాణికులను ఆకట్టుకునేలా టీ-24, ఎఫ్‌6, ఎఫ్‌9, తదితర పాసులను తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరిగింది. అయినప్పటికీ ఇంకా..ఇంకా అని కండక్టర్ల మెడమీద కత్తి పెట్టి మరీ అధికారులు ఒత్తిడిచేస్తున్నారు. మే నెలలో గతంతో పోల్చుకుంటే టీ-24 టిక్కెట్ల అమ్మకం బాగా పెరిగింది. సుమారు 32 వేల టీ-24 టికెట్లు అమ్ముడుపోయాయి. ఎఫ్‌-6 టికెట్లను రోజుకు నాలుగైదువేల మేరకు ప్రయాణికులు కొంటున్నారు. పబ్లిక్‌ హాలిడేస్‌ సందర్భంగా స్పెషల్‌ పాసులు సగటున రోజుకు 700 దాకా తీసుకుంటున్నారు.
ఒక బస్‌స్టాఫ్‌ నుంచి మరో స్టాఫ్‌ వచ్చే వరకు టికెట్లు ఇవ్వడమే సిటీ బస్సుల్లో గగనం. ఒక్కో ప్రయాణికుణ్నీ సార్‌ టికెట్‌ కొనండి..అయ్యా కొనండి అంటూ బతిమిలాడే సమయమూ ఉండదు. పాసుకంటే రానుపోను తక్కువ కిరాయైతే అలాంటి వారు ఆసక్తి చూపరు. ఇలా కొన్ని రూట్లలో తక్కువ పాసులు అమ్ముడుపోతున్నాయి. దీన్ని ఎత్తిచూపుతూ డిపో మేనేజర్లు వేధింపుల పర్వానికి దిగుతున్నారు. మేడ్చల్‌, మియాపూర్‌ డిపో మేనేజర్లు తక్కువ టికెట్లు అమ్మిన కండక్టర్ల పేరుతో ఏకంగా ప్లెక్సీలనే ముద్రించి బహిరంగంగా ప్రదర్శించడం ఇప్పుడు వివాదాస్పదమవుతున్నది. ఆ ఫ్లెక్సీల్లో ఫొటోలు ముద్రితమైన కండక్టర్లు అవమాన భారంతో ఏమైనా చేసుకుంటే ఆ కుటుంబాలకు దిక్కెవరు? బాధ్యులెవరు? అంటూ ఆర్టీసీ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకిలా..?
టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం మరోవైపు డిపోలకు మెంటార్లను నియమించింది. ఉన్నతాధికారుల్లో ఒక్కొక్కరికి రెండు, మూడు డిపోలను అప్పగించింది. మార్చి నుంచీ ఈ విధానం తీసుకొచ్చి ఆదాయంపై టార్గెట్లు విధిస్తున్నది. ఆ మేరకు పైనుంచి అధికారుల ఒత్తిడి తీవ్రంగా ఉంది. డిపోల్లోని కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అంతిమంగా దీని ప్రభావం డ్రైవర్లు, కండక్టర్లపైనే పడుతున్నది. కార్మికులపై వేధింపులు పెరిగాయి. దీంతో వారిలో అభత్రాభావం రోజురోజుకీ పెరిగిపోతున్నది. అయితే, బస్సుల సంఖ్య, రూట్లలో సర్వీసుల సంఖ్య పెంచకుండా ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెట్టినా ప్రయోజనం ఉండదు. రాష్ట్రంలోని మొత్తం 96 డిపోల్లో 76 నష్టాల్లో ఉండటమే దీనికి నిదర్శనం. డిపోల నష్టాలకు ఉన్నతాధికారులు ఎందుకు బాధ్యులు కారు? వారి ఫొటోలు ముద్రించి బస్‌భవన్‌, డిపోల ఎదుట పెడితే కార్మికుల బాధేంటో వారికి తెలుస్తుంది అని కార్మికులు అభిప్రాయపడుతున్నారు.
డ్యూటీ సమయాల్లోనూ వేధింపులే..
హైదరాబాద్‌ పరిధిలో ఆర్టీసీ కార్మికులు 13,800 మంది దాకా పనిచేస్తున్నారు. అందులో ఏడు నుంచి ఎనిమిది వేల మంది కండక్టర్లు ఉన్నారు. వారి డ్యూటీ సమయం కాగితాలకే పరిమితమైంది. ట్రాఫిక్‌జామ్‌, పీక్‌ అవర్స్‌, తదితర కారణాలతో బస్సుల సమయపాలనలో తేడా వస్తున్నది. ఎంత సమయం అయినా సరే రోజువారీ ట్రిప్పుల టార్గెట్‌ పూర్తి చేసిన తర్వాతనే ఇండ్లకు వెళ్లాల్సి వస్తున్నది. ఇలా రోజుకు 12 గంటల నుంచి 14 గంటల దాకా పనిచేస్తున్నా వారి కష్టాన్ని యాజమాన్యం గుర్తించడంలేదు. పైగా, టార్గెట్ల పేరుతో ఇలా వేధింపులకు పాల్పడుతున్నది. ఎవరైనా బంధువులు చనిపోతే ఫొటోలు, ఆధారాలు చూపితేగానీ అతికష్టం మీద సెలవు ఇస్తున్నారనీ, సెలవు మరుసటి రోజు డిపోకెళ్తే డ్యూటీ ఇవ్వకుండా కూర్చోబెట్టి మరీ వేధిస్తున్నారని ఓ కార్మికుడు తన ఆవేదనను వ్యక్తపరిచాడు.
దీనిపై దృష్టేది?
రాష్ట్రంలో బస్సుల సంఖ్య గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గింది. డిపోలనూ కుదించారు. ఆయా రూట్లలో సర్వీసుల సంఖ్యనూ తగ్గించారు. హైదరాబాద్‌లో మధ్యాహ్నం, రాత్రి 9:30 గంటలు దాటిన తర్వాత చాలా రూట్లలో బస్సుల సంఖ్య తగ్గించేస్తున్నారు. ఒకటెండ్రు బస్సులనే తిప్పుతున్నారు. దీంతో ప్రయాణికులు అరగంటకు పైనే వేచిచూడాల్సి వస్తున్నది. దీంతో అనివార్యంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఫలితంగా బస్సుల్లో అనివార్యంగా ప్రయాణికులు సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతున్నది. బస్సుల సంఖ్యను పెంచడం, రూట్లలో సర్వీసులు పెంచడం వంటి దానిపైన ఆర్టీసీ యాజమాన్యం దృష్టే పెట్టడం లేదు. కీలకమైన రూట్లలో ప్రయివేటు బస్సులు ఇష్టానుసారంగా తిరుగుతున్నా వాటిని నియంత్రించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం లేదు. ఇవేమీ చేయకుండా ఆదాయం తేవాలంటూ ఉన్న సిబ్బందిపై వేధింపుల పర్వానికి దిగుతున్నది.
ఫ్లెక్సీలు పెట్టడం ముమ్మాటికీ తప్పే
ఆర్టీసీ యాజమాన్యం ఆదాయాన్ని పెంచుకోవ డాన్ని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ తప్పుబట్టడం లేదు. వివిధ రకాల పాసులను ప్రవేశపెట్టారు. వాటి వల్ల ప్రయో జనాలను కార్మికులకు అర్థం చేయించడం, అది చెప్ప గలిగే సమయం ఉండేలా చూడాలి. లోపాలు గమ నిస్తే సరిచేసేలా ఉండాలి. అంతేగానీ కార్మికులపై వేధింపులు సరిగాదు.
ఫ్లెక్సీలు పెట్టించి అవమానిం చడం ముమ్మాటికీ పెద్ద తప్పు. ఇలాంటి చర్యలను అందరూ ఖండించాల్సిందే.మెంటార్ల వ్యవస్థను తీసుకొచ్చి మూడు నెలలు గడుస్తున్నది. అధికారుల ఫొటోలు ఎక్కడైనా పెట్టారా? కార్మికులను మాత్రమే దోషులుగా ఎందుకు చూపెడుతున్నారు? ఇలాంటి నిరంకుశ చర్యలు కార్మికుల్లో అభత్రా భావాన్ని పెంచుతాయి తప్ప ప్రయోజనం ఉండదు.
ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ప్రధాన కార్యదర్శి వీఎస్‌.రావు