మహిళలకు ఫ్రీ బస్‌ జర్నీ!

– కర్నాటక తరహాలో సీఎం కేసీఆర్‌ కొత్త స్కీమ్‌
– కాంగ్రెస్‌ కంటే ముందే ప్రకటించేందుకు వ్యూహం
– సర్వే చేయాలంటూ ఇప్పటికే ఆదేశాలు
– మహిళల లెక్క కోసం టిమ్స్‌లో ప్రత్యేక ఆప్షన్‌
– వచ్చే ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టే యోచన
కొత్త స్కీంలను వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుడుతున్నారు. దానిలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని కర్నాటక కాంగ్రెస్‌ తరహాలో మేనిఫెస్టోలో పెట్టాలని భావిస్తున్నారు. అలాగే 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్‌ వినియోగదారులకు ఉచిత కరెంటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ హామీని ఇప్పటికే ఢిల్లీలోని కేజ్రీవాల్‌ సర్కారు అమలు చేస్తున్నది. దీనిపై సాధ్యాసాధ్యాలనూ అధ్యయనం చేస్తున్నారు. ఇలాంటి హామీలతోనే సెప్టెంబర్‌ 17న రాష్ట్ర కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. దానికంటే ముందు తామే ఆ హామీలను ఇచ్చేస్తే, ఓట్ల వర్షం కురుస్తుందని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు!
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రానున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బీసీలకు ఆర్థిక సాయం.. వికలాంగుల పెన్షన్‌ పెంపు… తదితర నూతన కార్యక్రమాలు, పథకాలను ప్రకటించిన బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌… ఇప్పుడు అదే కోవలో ఓ మరో పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కాకపోతే అది మొన్నటి కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు కురిపించిన స్కీమ్‌ కావటం గమనార్హం. అక్కడ హస్తం పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ‘మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం…’ అంటూ హామీనిచ్చి ఫలితం పొందింది. ఆ రాష్ట్ర సీఎం సిద్ధరా మయ్య ఆదివారం ఆ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలో అదే అంశాన్ని ఇక్కడ కూడా ప్రయోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు సీఎం కేసీఆర్‌ వచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌… కర్నాటక ఎన్నికల ప్రణాళికలోని అనేకాంశాలను తీసుకోనుంది. తద్వారా మ్యానిఫెస్టోను తయారు చేసి సెప్టెంబరు 17న విడుదల చేసేందుకు ఆ పార్టీ సంకల్పించిన విషయం విదితమే. అయితే అందులోని పలు కీలకాంశాలతోపాటు ప్రధానమైన ‘మహిళలకు ఉచిత ప్రయాణం’ హామీని తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఆ హామీని కాంగ్రెస్‌ కంటే ముందుగా తామే ప్రకటించటం ద్వారా మహిళా ఓటర్లను ఆకర్షించాలనేది ఆయన వ్యూహమని బీఆర్‌ఎస్‌ కు చెందిన ఓ నేత వ్యాఖ్యానించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌… ఆర్టీసీ ఉన్నతాధికారులకు ‘రోజువారీగా, క్రమం తప్పక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య’ను లెక్కగట్టాలంటూ ఆదేశాలిచ్చినట్టు సమాచారం. దానికి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు మహిళా ప్రయాణీకుల సంఖ్యను లెక్కగట్టేందుకు టిక్కెట్‌ ఇష్యూ మిషన్స్‌ (టిమ్స్‌)లో ప్రత్యేక ఆప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఆ ఆప్షన్‌ ప్రకారం… మహిళా ప్రయాణీకుల సంఖ్యను లెక్కగట్టి చెప్పాలంటూ ఆర్టీసీ యాజమాన్యం తమకు ఆదేశాలిచ్చినట్టు హైదరాబాద్‌లోని ఓ డిపోకు చెందిన కండక్టరు తెలిపారు. రోజువారీగా ఏయే తరగతులకు చెందిన మహిళలు ఎక్కువగా ఏయే జిల్లాల్లో, ఏయే రూట్లలో ప్రయాణిస్తున్నారు..? అనే విషయాలను రిపోర్టులో స్పష్టంగా పేర్కొనాలంటూ సీఎం ఆర్టీసీ అధికారులకు సూచించినట్టు తెలిసింది. రైతు బంధు, రైతు బీమా ద్వారా అన్నదాతలను, ఆసరా పెన్షన్ల ద్వారా వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులను తమ పార్టీ వైపునకు తిప్పుకున్న గులాబీ దళపతి… అదే తరహాలో ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే పేద, మధ్య తరగతి, చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు, ఉద్యోగాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సును ఆశ్రయించే మహిళా ఓటర్లే లక్ష్యంగా పథకాన్ని రూపొందించబోతున్నారు. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించటం ద్వారా సంస్థపై ఎంత భారం పడుతుంది..? ఆ భారాన్ని భరించటానికి వీలుగా కర్నాటక సర్కారు ఏం చేయబోతోందనే అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలంటూ ఆయన ఆదేశించారు. తద్వారా ఆ పథకానికి రూపకల్పన చేసి… ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చాలని భావిస్తున్నారు.

Spread the love