ఆర్టీసీ ‘రాఖీ’ ఆదాయం రూ.22.65 కోట్లు

– గమ్యస్థానాలకు చేరిన 40.92 లక్షల మంది ప్రయాణీకులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీ రాఖీ పౌర్ణమి సందర్భంగా 40.92 లక్షల మంది ప్రయాణీకుల్ని గమ్యస్థానాలకు చేర్చి రూ.22.65 కోట్ల రాబడిని సాధించింది. అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 104.68 శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) నమోదయ్యింది. గత ఏడాది రాఖీ పౌర్ణమికి ఆర్టీసీకి రూ.21.66 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది దానికంటే ఎక్కువ ఆదాయం వచ్చినట్టు సంస్థ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. గత ఏడాది కంటే దాదాపు లక్ష మంది ప్రయాణీకులు అదనంగా రాకపోకలు సాగించారని వివరించారు. అలాగే, గత ఏడాది రాఖీ రోజు 35.55 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరిగాయి. ఈ ఏడాది 36.77 లక్షల కిలోమీటర్లు తిరిగినట్టు తెలిపారు. 20 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్‌ నమోదైందన్నారు. రికార్డుస్థాయిలో అత్యధికంగా ఒక కిలోమీటర్‌కు రూ.65.94 పైసలు వరంగల్‌-1 డిపో, రూ.65.64 పైసలు భూపాలపల్లి డిపో సాధించాయని పేర్కొన్నారు. ‘ప్రజా రవాణా వ్యవస్థ వెంటే తాము ఉన్నామని ప్రజలు మరోసారి నిరూపించారు’ అని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు ముఖ్యంగా మహిళా ఉద్యోగులు రాఖీ పండుగ రోజును త్యాగం చేసి మరీ విధులు నిర్వర్తించారని గుర్తు చేశారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఆర్టీసీపై ప్రజలు ఇదే తరహా విశ్వాసాన్ని వ్యక్తంచేసేలా సిబ్బంది కృషి చేయాలని ఆకాంక్షించారు.