హిందీని రుద్దడం చట్ట ఉలంఘనే!

– అంగీకరించిన కేంద్రం
న్యూఢిల్లీ : దేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సు చట్టాన్ని ఉల్లంఘించడమేనని కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది. తన పరిధిలో లేని అంశంపై కమిటీ చేసిన సిఫార్సు అధికార భాషా చట్టాన్ని ఉల్లంఘించిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్‌, కేంద్ర విశ్వవిద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయా వంటి సంస్థల్లో ప్రధాన భాషగా ఇంగ్లీషు స్థానంలో హిందీని ప్రవేశపెట్టాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు గత ఎనిమిది మాసాలుగా రాష్ట్రపతి పరిశీలనలో వుంది. గత ఏడాది డిసెంబరులో సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ రాజ్యసభలో మాట్లాడుతూ, ఈ సిఫార్సు చట్టాన్ని ఉల్లంఘించడమా? కాదా? అని ప్రశ్నించారు. కానీ ఆయనకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. దీంతో బ్రిట్టాస్‌ సభాధ్యక్షులైన ఉప రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అనంతరం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనికి సమాధానం ఇచ్చింది. ఆ సిఫార్సు చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. హిందీని అధికార భాషగా ఉపయోగించడానికి సంబంధించి నెలకొన్న పురోగతిని అంచనా వేసి, రాష్ట్రపతికి నివేదిక అందజేయడమే కమిటీ బాధ్యత. అంతకుమించి మరే ఇతర జోక్యానికి అనుమతి లేదా అధికారమివ్వలేదు. అయితే, సమాధానంలో దీన్ని ప్రస్తావించకుండా చట్టాన్ని ఉటంకించారు. హిందీతోపాటు ఇంగ్లీషును కూడా అధికార కార్యాచరణకు ఉపయోగించాలని అధికార భాషా చట్టం పేర్కొంటోంది. పార్లమెంట్‌, రాష్ట్రాల శాసనసభలు చట్టాన్ని ఆమోదించే వరకు షరతులకు కట్టుబడి వుండేందుకు కేంద్ర హోం శాఖ అంగీకరించింది. పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల నివేదిక బుట్టదాఖలు చేసే అవకాశం ఉండటంతోనే కేంద్రం ఇంకా దీన్ని బహిరంగపరచలేదని పరిశీలకులు భావిస్తున్నారు.