– దేశ చరిత్రలోనే తొలిసారి
– మోడీ పాలనలో భారత కరెన్సీ విలవిల
– ఒక్క పూటలోనే 48 పైసలు క్షీణత
– 83.61 చేరిన రూపాయి
ముంబయి : అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి వెలవెల పోతోంది. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ప్రధాని మోడీ హయంలో రికార్డ్ పతనాన్ని చవి చూసింది. శుక్రవారం నాడు విదేశీ మారకం మార్కెట్‌లో డాలర్‌తో పోల్చితే ఒక్క పూటలోనే 48 పైసలు క్షీణించి మునుపెన్నడూ లేని విధంగా 83.61కు పడిపోయింది. వరుసగా ఎనిమిది రోజుల పాటు దిగజారిన రూపాయి మారకం విలువ గురువారం 6 పైసలు పుంజుకుంది. తదుపరి రోజే డాలర్ ముందు 48 పైసలు కోల్పోవడం గమనార్హం. ఓ దశలో 52 పైసలు నష్టపోయి 83.65కు పడిపోయి.. ఆల్‌టైం ఇంట్రాడే కనిష్టాన్ని చవి చూసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకలో వరుస పతనం.. దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి తరలిపోతున్న ఎఫ్‌ఐఐలు రూపాయి విలువపై ఒత్తిడిని పెంచుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. గతేడాది డిసెంబర్ 13న డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 83.40 స్థాయికి పడిపోయి జీవిత కాల కనిష్టాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మళ్లీ తాజాగా భారీ పతనాన్ని చవి చూసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ ఇలాగే పడిపోతే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల పరిణామాలు ఉంటాయి. అప్పుల చెల్లింపు భారం కానుంది. దిగుమతి ఉత్పత్తులు మరింత ప్రియం అవుతాయి. దేశ వాణిజ్య లోటు పెరగనుంది. ద్రవ్యోల్బణం ఎగిసి పడే ప్రమాదం ఉంది. దీంతో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచనుంది. రూపాయి పతనం స్థూలంగా భారత ఆర్థిక వ్యవస్థను బలహీనపర్చనుంది.