జీవన ప్రమాణాలకు ఆమడ దూరంలో ఉండే గ్రామం. అయినా పట్టుదలతో కుంచెను పట్టుకున్నాడు. అందరిలా ఎంసెట్ ర్యాంకులు, మెడిసిన్ సీట్లు వెంట కాకుండా తనకు నచ్చిన రంగులతో బొమ్మలు గీసుకుంటూ ముందుకెళ్లాడు. చిత్రలేఖనమే విద్యగా ఎంచుకుని గ్రామీణ సంస్కృతిని కాన్వాస్‌పై అందంగా మలిచాడు. అతడి చిత్రాలకు ఢిల్లీలోని లలితకళ అకాడమీ పిలిచి మరీ ప్రదర్శనకు ఉంచింది. ఓ చేనేత కుటుంబం నుంచి ఈ స్థాయికి ఎదిగిన యువ కళాకారుడు బీరె గంపమల్లయ్యతో ఈవారం జోష్ ముచ్చట్లు…
కరువు నేలలో పుట్టిన మీరు కళలవైపు ఎలా ఆసక్తి కలిగింది?
కరువు నేలనే కానీ కళలకు మారుపేరు మా రాయలసీమ. కళలు నేర్పింది మన రాయలసీమ. సహజంగా కళ పుట్టుకతో రాకపోయినా కళల పట్ల జిజ్ఞాస పుట్టుక ద్వారానే కొంత వస్తుంది. నాలో ఉన్న ఈ చిత్రకళను మొదటగా గుర్తించింది ప్రాథమిక స్థాయిలో పాఠాలు చెప్పిన ఎల్.ఆర్. వెంకటరమణ సార్. చదువు మీద మాత్రమే కాకుండా పిల్లలలో ఉన్న నైపుణ్యాలకు మెరుగులు దిద్ది వారిని ప్రోత్సహించేవారు. డ్రాయింగ్ మీద నాకున్న ఆసక్తి చూసి, స్కూల్ టైంలో చదువు డిస్ట్రబ్ కాకూడదనే ఉద్దేశంతో ఆదివారాలు స్కూలుకు వచ్చి ఆయనే పేపర్స్, పెన్సిల్స్ ఇచ్చి మరీ డ్రాయింగ్ నేర్పించేవారు. మండల కేంద్రాలలో జరిగే డ్రాయింగ్ పోటీలకు తీసుకెళ్లేవారు. అలా నాకు ఆర్ట్ మీద ఆసక్తి పెరిగేలా చేశారు. ఆరోజుల్లో వెంకటరమణ సార్ నాటిన చిత్రలేఖనమనే విత్తనమే ఈరోజు నేను ఆర్టిస్ట్ అవ్వడానికి దోహదపడింది.
మీ నేపథ్యం?
మాది అనంతపురం జిల్లాలోని సొరకాయలపేట అనే చిన్న పల్లెటూరు. నాన్న తాతయ్య. అమ్మ లక్ష్మీదేవి. మేము మొత్తం ముగ్గురు సంతానం (ఇద్దరు అక్కలు). పేరుకు చేనేత కుటుంబమే అయినా వ్యవసాయ కూలీలుగా మారి మమ్మల్ని చదివించారు. పెద్ద అక్క (పుష్పలత) స్కూల్ స్థాయి వరకు, చిన్నక్క(చౌడమ్మ) ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. వారికి పెళ్ళిళ్ళు చేసి రోజువారీ కూలిపనులకు పోతూనే నన్ను విశ్వవిద్యాలయ స్థాయి వరకు చదివించారు. ఆర్థికలేమి, లింగభేదాలకు గురికాపోయి ఉంటే మా అక్కల ప్రతిభ కూడా ఈ సమాజం చూసి ఉండేది.
చిత్ర నైపుణ్యం ఎక్కడ అభ్యసించారు?
మా ఊరిలో ఆరవ తరగతి వరకే ఉంది. ఏడవ తరగతికి పక్క ఊరికి వెళ్లి చదువుకోవాల్సి వచ్చేసరికి మాకు వెంకటరమణ సార్ దూరం అయిపోయారు. దాంతో ఆర్ట్ మీద టైం కేటాయించలేక పోయాను. ఖాళీ సమయంలో అప్పుడప్పుడు గీసుకుంటూ వెళ్ళిపోయా. టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ బీఎస్సీ పూర్తి చేశాను. డిగ్రీ అయిపోయిన తర్వాత పి.జి. ఎక్కడ చేద్దామని ఆలోచిస్తున్న రోజుల్లో ఎస్.కె. యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీకి అప్లై చేశాను. మిత్రుడు అల్లిపీరా ఆర్ట్ మీద నాకున్న ఇంట్రెస్ట్ గమనించి ‘యోగివేమన యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ కోర్స్ ఉంది. జాయిన్ అవ్వొచ్చుగా’ అన్నాడు. చేస్తున్న పీజీ వదిలేసి, డిగ్రీ కోర్సులో జాయిన్ ఎలా అవ్వాలి? అందులోనూ నాలుగేళ్ళ కోర్సు?… మొదట్లో ఆలోచించా. తర్వాత ఇంట్లో వాళ్లకు చెబితే… ‘మాకు చదువు రాదు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెరు. నీకు నచ్చింది కదా కొనసాగించు. ఎంత డబ్బైనా సరే మేం కూలిపనికి పోయి నిన్ను చదివిస్తామ’న్నారు. నువ్వు భవిష్యత్‌లో బాగుండాలా అదే మాకు కావాల్సింద’న్నారు. ఆ మాటతో ఫైనార్ట్స్‌కి అప్లై చేయడం, జాయిన్ అవ్వడం చకచక జరిగిపోయాయి. అలా కడప యోగివేమన యూనివర్సిటీలో చిత్రలేఖనం కోర్స్ పూర్తి చేశాను.
మీ పెయింటింగ్స్‌లో ఎక్కువగా గ్రామీణ సంస్కృతి ఉండడానికి కారణం మీ జీవితమేనా?
అవును. ఎందుకంటే మా నాన్న చేనేతవత్తిని వదిలేసి, కూలిపనికి వెళ్లడం, పొట్టెండ్లు, మేకలు, గొర్రెలు పెంచడం చేశాడు. దాంతో సమయం దొరికినప్పుడల్లా నేను కూడా వాటిని మేపుకు రావడం చేసేవాణ్ణి. తెలియకుండానే జంతువుల మీద మమకారం, ప్రకతి మీద ప్రేమ మొదలయ్యింది. ఆ పనులే నా మనసులో ఉండిపోయాయి. ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అయిన తర్వాత చిన్నప్పుడు ఆస్వాదించినవే నేను వేసే ప్రతి పెయింటింగ్‌లోనూ ఎక్కడో అక్కడ తెలియకుండానే పల్లెటూరు మనుషుల్ని, పొట్టేలలను, ఎద్దుల్ని, పల్లెటూరు వాతావరణాన్ని డ్రా చేస్తుంటాను. నేను నివసించిన ప్రాంతం పల్లెటూరు. అక్కడ నాకు ఒక మేక, గొర్రె, ఎద్దు ఎలా ఉంటుందో తెలుసు. మనిషి పనికి వెళ్లినప్పుడు వాళ్ళ ముఖచిత్రాలు, ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటాయో తెలుసు. సిటీ కల్చర్ ఎలా ఉంటుందో పెద్దగా తెలియదు. పుట్టి పెరిగిన ప్రాంతమే నా పెయింటింగ్‌లో చూయిస్తూ వచ్చాను.
మీరు వేసే పెయింటింగ్స్‌లో రాయలసీమ జీవన వైవిధ్యం ఉంది. అందుకు ఏమైన ప్రత్యేక కారణం ఉందా?
మాది చిన్న పల్లెటూరు కావడం వల్ల సహజంగా రాయలసీమలో గ్రామాల్లో ఉండే డప్పుల మేళాల శబ్దం, అమ్మవారి జాతరలు, రామ భజనలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొ పండుగ జరుపుతూ ఉంటారు. జనవరి శూన్య మాసం రాగానే గంగమ్మ జాతర, ఎల్లమ్మ, చౌడమ్మ, పెద్దమ్మ, సుంకులమ్మ జాతర్లు, వర్షాలు రాకపోతే గాలెమ్మ ఊరేగింపు, శ్రీరామనవమి రాగానే భజనలు, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఊరి జాతర చేస్తుంటారు. నేను చిన్నప్పటినుంచి ఇలాంటి సంప్రదాయాల్ని చూస్తూ పెరిగాను. ఒక జాతర జరగాలంటే దాసప్ప ఉండాలి. ఒక అమ్మవారి ఊరేగింపు జరగాలంటే డప్పులు ఉండాలి. సీతరామలక్ష్మణుల విగ్రహాల ఊరేగింపు జరగాలంటే భజనలు ఉండాలి. ఇవన్నీ చిన్నప్పటినుంచి నా మనసులో ముద్రించుకున్న చిత్రాలు. నేను ఫైన్ ఆర్ట్స్ థర్డ్ ఇయర్ చేస్తున్నప్పుడు కాన్సెప్ట్ మీద వర్క్ చేయండని మా యూనివర్సిటీలో చెప్పగానే చాలా మంది పికాసో పెయింటింగ్స్, రజాక్ పెయింటింగ్స్, డాలి పెయింటింగ్స్‌ని రిఫరెన్స్ గా తీసుకున్నారు. ఆల్రెడీ ఫేమస్ అయిన ఆర్టిస్టులు పెయింటింగ్స్ రిఫరెన్స్‌గా తీసుకొని చేస్తే మనకంటూ ప్రత్యేక గుర్తింపు ఎలా ఉంటుంది. నేను పుట్టి, పెరిగింది పల్లెటూరు. పల్లెల్లో పండుగలు ఎలా చేస్తారో తెలుసు. వాటికి ఏమేమి సామాగ్రి వాడతారో తెలుసు. వీటి మీద పెయింటింగ్ వేయాలని నిర్ణయించుకున్నాను. మొదట్లో ఒక రెండు పెయింటింగ్స్ వేశాను. ఈ రెండు పెయింటింగ్స్ చూడగానే చాలామంది నన్ను హేళన చేసి మాట్లాడారు. ఏంటి ఇప్పుడు ఆ లుంగీలు కట్టుకొని, రుమాలు చుట్టుకొని, ఆ మనుషులు ఏంటి? ఏం చేస్తున్నావు. నీకు ఏమైనా అర్థమవుతుందా అని కొంతమంది నన్ను అన్నారు. నేను పుట్టిన ప్రాంతం ఋణం తీర్చుకోవాలనే ధ్యేయంతో, ఎవరేమన్నా సరే పట్టించుకోకుండా మా రాయలసీమలో కనుమరుగవుతున్న సంప్రదాయాన్ని నా పెయింటింగ్స్ ద్వారా ఈ జనరేషన్‌కి తెలియజేయాలనుకున్నాను. రాయలసీమ కల్చర్‌ను టాపిక్ గా తీసుకుని, ఢిల్లీ లలితకళ అకాడమికి వెళ్ళి వర్క్ చేశాను. ఢిల్లీలో మా ప్రాంతం పేరును ప్రస్తావించేలా చేశాను.
పెయింటింగ్స్ అభ్యసించిన వారికి ఏయే అవకాశాలు దక్కనున్నాయి?
బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేసినవారు ప్రొపెషనల్ ఆర్టిస్ట్‌గా ఉండొచ్చు. ఫ్రీ లాన్సర్‌గా పత్రికలకు పనిచెయ్యవచ్చు. చిత్రసీమలో ఆర్ట్‌డైరెక్టర్‌గా, డిజైనర్‌గా కూడా వెళ్లొచ్చు. ఆర్ట్‌టీచర్‌గా, కంపెనీలకు డిజైనర్‌గా ఇలా చాలానే అవకాశాలున్నాయి. మనం ఎంత నైపుణ్యంగా, అంకితభావంగా ఉన్నామన్న దానిమీదే ఆర్టిస్ట్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
చిత్రసీమవైపు ఏమైనా ఆలోచనలు ఉన్నాయా?
ప్రస్తుతానికి లేదు. కానీ భవిష్యత్తులో చేయాలన్న ఒక ఆలోచన ఉంది. బేసిక్‌గా నేను వేసే పెయింటింగ్ ఏవైనా సరే కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా, ఒక పోస్టర్ డిజైనర్‌లా ఉంటాయి. సినిమా ఫీల్డ్‌లో స్టోరీ బోర్డు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్టోరీబోర్డులో మెయిన్‌గా లైన్ వర్క్ ముఖ్యం. నాకు ఆ లైన్ వర్క్ అంటే ఇంట్రెస్ట్. భవిష్యత్తులో అవకాశాలు వస్తే తప్పకుండా చిత్రసీమవైపు అడుగులు వేస్తాను.
భవిష్యత్తు లక్ష్యాలు?
ఒక మంచి రాయలసీమ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకోవాలనేది నాడ్రీమ్. నా విద్య నలుగురికి ఉపయోగపడాలి. చిన్నప్పుడు వెంకటరమణ సార్ దగ్గర ఒక చిన్న ఆలోచనతో మొదలైన నా ప్రయాణం ఈరోజు ఆర్టిస్ట్‌గా ఎలా పేరు వచ్చిందో నా ద్వారా కూడా కొంతమంది ఆర్టిస్టులు ఈ ప్రపంచానికి పరిచయం కావాలి. కూలిపనికి పోయి కష్టపడి నన్ను చదివించిన మా అమ్మానాన్నలను స్టేజ్ ఎక్కించి, మీ అబ్బాయి మల్లయ్య గొప్ప కళాకారుడు. మీరు గొప్ప కొడుకుని కన్నారని నలుగురితో వాళ్లముందే అనిపించుకోవాలి. నా సక్సెస్ వాళ్లకు నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్. ప్రస్తుతం కడపలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో డ్రాయింగ్ టీచర్‌గా వర్క్ చేస్తున్నాను.
మీ కళలకు అందుకున్న గుర్తింపు, అవార్డులు?
– ఆరవ తరగతిలో కోనసీమ చిత్రకళ పరిషత్, ప్రతిభ ఆల్ ఇండియా యూత్ చైల్డ్ ఆర్ట్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి.
– ఫైన్ ఆర్ట్స్ కోర్స్ లోకి వచ్చిన తర్వాత నేను గీసిన రంగోలి చిత్రానికి నేషనల్ వైడ్ మొదటి స్థానం.
– ఆల్ ఇండియా యూనివర్సిటీస్ అసోసియేషన్ సౌత్ జోన్‌లో గోల్డ్ మెడల్
– నేషనల్ ఆల్ ఇండియా యూనివర్సిటీస్ అసోసియేషన్ నిర్వహించిన నేషనల్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్.
– తిరుపతి ఆర్ట్ సొసైటీ వారి పోటీల్లో రాజా రవివర్మ అవార్డు
– యువ ప్రతిభ ఆల్ ఇండియా వారు నిర్వహించిన 3500 చిత్రాలు నేషనల్ స్థాయిలో ఎంట్రీ కాగా అందులో సీనియర్స్ కేటగిరిలో 20 చిత్రాలు మాత్రమే ఎంపిక చేశారు. అందులో నా చిత్రం 8వ స్థానంలో ఎంపికయ్యింది.
– ఢిల్లీ లలితకళా అకాడమిలో నేను గీసిన చిత్రం ప్రదర్శనకు పెట్టారు.
– రాయలసీమ సంస్కృతివారు నిర్వహించిన పెయింటింగ్ కాంపిటీషన్లో (2024) మొదటిస్థానం
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417