ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల జోరు..!

– బడిబాటలో.. కొత్తగా లక్ష మందికిపైగా విద్యార్థుల చేరిక
– ప్రయివేటు స్కూళ్ల నుంచీ జాయినింగ్స్‌
– విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆసక్తి
ముగిసిన బడిబాట.. కొనసాగనున్న ప్రవేశాలు ప్రక్రియ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల ధనదాహం, దోపిడీ.. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెరుగుదల నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండగా.. అందుకు అనుగుణంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి స్పందన వస్తోంది. ప్రధానంగా సర్కారు బడుల్లో మనబస్తీ-మనబడి ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అంతకంతకూ ఆసక్తి పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులపాటు నిర్వహించిన బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. ఉపాధ్యాయులు గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీల్లో ఇంటింటికీ తిరిగి కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికిపైగా విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రయివేటు స్కూళ్ల నుంచి కూడా చేరినట్టు చెబుతున్నారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. పూర్తి లెక్కలు రావాల్సి ఉంది. 1 నుంచి 12 తరగతి వరకు ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లల్లో బడిబాట కార్యక్రమం జరిగింది.
పెరిగిన విద్యార్థుల సంఖ్య
విద్యార్థులను సర్కారు స్కూళ్ల వైపు ఆకర్షించడం కోసం ప్రభుత్వం ప్రతియేటా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈనెల 3వ తేదీ నుంచి 17వ తేదీ వరకు షెడ్యూల్‌ ప్రకారం రోజుకొక కార్యక్రమంతో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కలిసి అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన జరుగుతోంది. మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, యూనిఫామ్‌ పంపిణీ, డిజిటల్‌ విద్య, మన (బస్తీ), ఊరు- మనబడిలో భాగంగా పాఠశాలల అభివృద్ధి వంటి తదితర సౌకర్యాలను వివరిస్తూ పిల్లలను ప్రభుత్వ బడులవైపు ఆకర్షించేలా అవగాహన కల్పించారు. గతేడాదితో పోల్చిచూస్తే ఈ విద్యాసంవత్సరం లక్ష మందిని చేర్చించినట్టు సంబంధిత అధికారులు చెప్పారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇదంతా టీచర్లు, అధికారుల సమిష్టి కృషితోనే సాధ్యమైందని విద్యాశాఖ అధికారులంటున్నారు.
ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ..
బడిబాటలో భాగంగా మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బస్తీలు, కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ మధ్యలో చదువు మానేసిన వారిని, బాలకార్మికులను, బడీడు పిల్లలను, ప్రయివేట్‌ పాఠశాలల్లో చదివే వారిని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేశారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అడ్మీషన్లు పెరిగాయి. మరో నెల రోజులపాటు ఈ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోందని సంబంధిత అధికారులు తెలిపారు. నగరవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 691 ఉండగా.. 1,14,607 మంది విద్యానభ్యసిస్తున్నారు.
బడిబాటలో క్లాసుల వారీగా నూతన అడ్మిషన్లు సంఖ్య చూస్తే.. ప్రీప్రైమరీ 504 మంది, 1వ తరగతిలో అంగన్వాడీ నుంచి 1,226 మంది, ప్రయివేట్‌ స్కూళ్ల నుంచి 809, నేరుగా ప్రవేశాలు 3863 మంది, మొత్తం 1వ తరగతిలో 5,898 మంది అడ్మీషన్లు పొందారు. ఇక ఆయా ప్రయివేట్‌ పాఠశాలల నుంచి 2వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 6918 మంది ప్రవేశాలు పొందగా.. ఒకటి నుంచి కలిపితే ప్రయివేట్‌ పాఠశాలల నుంచి 7,727 మంది చేరారు. ఇలా మొత్తం 12816 విద్యార్థులను స్కూళ్లలో చేర్పించారు. ప్రవేశాల ప్రక్రియ వచ్చే నెల వరకు కొనసాగనుందని, ఇంకా విద్యార్థుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని జిల్లా సెక్టోరియల్‌ ఆఫీసర్‌ కనీజ్‌ ఫాతీమా తెలిపారు. మేడ్చల్‌ మల్కాజిగిరిలో 4600 చేరినట్టు జిల్లా అధికారులు తెలిపారు.
కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ బడుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య
హైదరాబాద్‌ – 12816
మేడ్చల్‌-మల్కాజిగిరి – 4600
సంగారెడ్డి – 6348
మెదక్‌ – 4135
సిద్దిపేట – 6185
జనగామ – 4580
వరంగల్‌ – 4604
హన్మకొండ – 3725
మహబూబాబాద్‌ – 3054
భూపాలపల్లి – 1860
ములుగు – 2006
నాగర్‌కర్నూల్‌ – 5008
మహబూబ్‌నగర్‌ – 4250
వనపర్తి – 3653
నారాయణ్‌పేట్‌ – 2150
గద్వాల్‌ – 135
ఆదిలాబాద్‌ – 4537
ఖమ్మం – 3,847
భద్రాద్రికొత్తగూడెం – 7,111