అంగన్‌వాడీల సమ్మెపై నిర్బంధం ఆపాలి : ఎస్‌.వీరయ్య

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల సమ్మెపై నిర్బంధాన్ని ఆపాలని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సమస్యలను పరిష్కరించడంతో పాటు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని అంగన్‌వాడీలు 16 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో ముందుకెళ్తున్నదని విమర్శించారు. తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నదనీ, ఇప్పటికే ఆదిలాబాద్‌ జిల్లా సీఐటీయూ, ఏఐటీయూసీ కార్యదర్శులను నగర బహిష్కరణ చేశారని తెలిపారు. అనేకమంది అంగన్‌వాడీ నాయకుల మీద నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టి వేధించడం దుర్మార్గమని పేర్కొన్నారు. అంగన్‌వాడీలకు పోటీగా ఇతర రంగాల కార్మికులను ఎగదోసే ప్రయత్నం చేస్తున్నదనీ, సెంటర్లను ఇతరులతో నిర్వహించాలని చూడటం సరిగాదని తెలిపారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్ల అంగన్‌వాడీ సెంటర్లు మూతబడి పేద కుటుంబాల పిల్లలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలనీ, నిర్బంధం ఆపాలని డిమాండ్‌ చేశారు. సమ్మెకు తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని తెలిపారు.