అక్టోబర్‌ 5 నుంచి ‘ఎస్‌ఏ-1’ పరీక్షలు

– 13 నుంచి దసరా సెలవులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో వచ్చేనెల ఐదో తేదీ నుంచి ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ-1) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అదేనెల 11 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఆరు, ఏడు తరగతుల వారికి ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు జరుగుతాయి. ఎనిమిదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు నిర్వహిస్తారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేపడతారు. జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి వచ్చేనెల 30న ఫలితాలను ప్రకటిస్తారు. నవంబర్‌ ఒకటిన తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించి మార్కుల రికార్డులను అందజేయడంతోపాటు విద్యార్థుల పురోగతిపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్చిస్తారు. వచ్చేనెల 13 నుంచి 25 వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు దసరా సెలవులుంటాయి.