గుళ్లు- యాగాలు

గుళ్లు- యాగాలుకైలాసంలో ముగ్గురు మూలపుటమ్మలు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. చాలా కాలం త ర్వాత ముగ్గురూ కలసి మాట్లాడుకునే వీలు చిక్కిం ది. వారు అట్లా చర్చలలో ఉండగానే నారదుడు వచ్చాడు! నమస్కరించాడు. కాని నారదుడి రాకను తల్లులు గమనించలేదు.
”నారాయణ, నారాయణ”! అన్నాడు నారదుడు గట్టిగా
తల్లులకి వినబడలేదు వారివి సుధీర్ఘమైన చర్చలు మరి!
నారదుడికి పరిస్థితి అర్థమైంది.
”లోకమాతలకి వందనం”! అన్నాడు.
అప్పుడు నారదుడిని గమనించారు. ఎంతైనా తల్లులు కదా!
”ఏమి నారదా! బహుకాల దర్శనం! అంతా కుశలమేనా”! అన్నారు.
”కుశలమే తల్లీ!” మీ కోసం పదమూడు లోకా లు గాలించి చివరికి ఇక్కడికి వచ్చితిని తల్లీ!” అన్నా డు నారదుడు మంచుదిమ్మె మీద చతికిల పడుతూ.
”పదమూడు లోకములు తిరగనేల? అలసి పోనేల? మేము ముగ్గురమూ కలసుకునే చోటు ఇదే కదా! నేరుగా ఇక్కడికే వచ్చినచో నీకు మార్గా యాసము తప్పేది కదా!” అన్నది లక్ష్మీదేవి నవ్వుతూ!
నిజమే తల్లీ! నేరుగా ఇక్కడికే వచ్చినచో నా అనుమానాలు తొందరగా నివృత్తి అయ్యి ఉండేవి”! అన్నాడు నారదుడు.
”నీ అనుమానాలు ఏమిటి చెప్పుము నాయనా! తీర్చెదము”. అన్నది చదువుల తల్లి సరస్వతి.
”ఏమీ లేదు! యజ్ఞ యాగములు చేసిన ఫలితము దక్కునా లేదా?” అన్నాడు నారదుడు.
ముగ్గురు తల్లులు ఫక్కున నవ్వారు.
”అయ్యో! నాయనా! ఇదే ప్రశ్న మానవులు అడిగనట్లైతే నీవు ముసలివాడవు అయ్యావు! అందుకే నీ బుద్ధి మందగించినది! అనే వారము. నీవేమో నిత్య యవ్వనుడవు! అయినా నీ బుద్ది మందగించింది! కారణమేమిటో”! అన్నది లక్ష్మీదేవి.
”నారదుడి బుద్ధి మాంద్యానికి కారణమేమిటో, నాకు తెలుసు చిరకాలంగా బ్రాహ్మచారిగా ఉండ టమే దీనికి కారణము. పెళ్ళి చేసుకో నారదా. నీ బుద్ది కూడా మా గణపతి బుద్ధి వలె ప్రకాశించును”! అన్నది పార్వతి నవ్వుతూ.
”తల్లులారా! ఇది మీకు న్యాయమా నా సందేహాన్ని తీర్చకుండా నా బ్రహ్మాచర్యముపై చర్చిం చుకురేల?” అన్నాడు నారదుడు చిన్నబుచ్చుకుని.
”నారదా! యజ్ఞ యాగాదులు చేసినపుడు హవి స్సు దేవతలకు, చేసినవారికి కోరుకున్న ఫలితము లభించును. ఇదే గతంలో కొనసాగింది. భవిష్యత్తు లో కూడా కొనసాగుతుంది. ఇందులో నీకు అను మానం ఎందుకు వచ్చింది?” అన్నది సరస్వతి దేవి.
”తెలంగాణలో ఇందుకు విరుద్ధంగా జరిగింది కదా!” అన్నాడు నారదుడు.
”తెలంగాణలో ఏమి జరిగింది నాయనా? మేము మాటల్లో పడి, దృష్టి సారించలేదు!” అన్నది లక్ష్మీదేవి.
”తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్‌ ఓడిపో యాడు. ఆయన ఎన్నికలకు ముందు రాజశ్యా మల యాగం చేశాడు. అంతకుముందు జరిగిన రెండు ఎన్నికల సమయంలో రాజ శ్యామల యాగం చేస్తే మీరు అనుగ్రహించి. కేసీఆర్‌కు రాజ్యధికారం ప్రసాదించారు కదా!” ఇప్పుడు ఎందుకిలా జరిగింది. యాగం చేసే సమ యంలో ఏదైనా అపచారం జరిగి మీరు ఆగ్రహిం చినారా? ప్రశ్నించాడు నారదుడు.
”అపచారం జరగలేదు! మేము ఆగ్రహించ లేదు!” అన్నది పార్వతి.
”మరి యాగ ఫలితం ఎందుకు తారుమా రైంది!” అడిగాడు నారదుడు.
”ఆగ్రహించినది మేము కాదు తెలంగాణా ప్రజలు!” అన్నది పార్వతి.
”తెలంగాణ ప్రజలకేమి తక్కువైనది. రైతు బంధు, దళిత బంధు, డబుల్‌ బెడ్రూములు, కళ్యాణ లక్ష్మీ, శాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్టు, ఉచిత విద్యుత్‌, సాగునీరు, తాగునీరు, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇలా ఒకటేమిటి? ఎన్నో అమలు చేసినారు! ఇక ఆగ్రహానికి తావెక్కడిది తల్లీ! అన్నాడు నారదుడు ఆశ్చర్యంగా.
పార్వతి చిన్నగా నవ్వింది.
”ఉచితాలు, సంక్షేమ పథకాలు మాత్రమే ప్రజ లను సంతృప్తి పరచలేవు నాయనా! ఉచితాలు పొందేవారి కన్నా శ్రమ చేసుకుని బతికే వారి సంఖ్య చాలా ఎక్కువ. పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, వివిధ రంగాలలో పనిచేసే కార్మికులు, ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా రెక్కల కష్టం చేసుకుని బతికేవారు. వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తే వారిని నిర్దాక్షిణ్యంగా అణిచివేసి, తనను అడుక్కోవాలని కేసీఆర్‌ అలోచించాడు. అన్నిటినీ మించి ఆర్టీసీ కార్మికులు 55 రోజుల సమ్మె చేస్తే, 39 మంది ఆ సమ్మెలో ప్రాణాలు అర్పించినా తన అహంకారం వీడలేదు! తన నియంతృత్వం తగ్గించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో పోరాటాలు, సమ్మెలు, నిత్యకృత్యమయ్యాయి. వాటికి ప్రభుత్వ అధినేత ఏనాడూ స్పందించలేదు. ”పైగా పోరాటాలు వీగిపోయేలా చేశానని విర్రవీగడం. అప్పటికప్పుడు సమ్మెలు ఏమీ సాధించినట్లు కన్పించలేదు! కాని వాటి ఫలితము ఎన్నికల్లో ఇట్లా కన్పించింది. ఇక రాజశ్యామల యాగం ఫలితం అంటావా? కార్మికులు కన్నెర్ర చేస్తే, ఏ యాగ ఫలితము దక్కదు నాయనా? వివరించింది! పార్వతి.
నారదుడు కొంత శాంతించాడు. కాని ఇంకా అనుమానం మిగిలే ఉంది.
”తల్లి! గత 70 ఏళ్ళలో ఎవరూ చేయని విధం గా లక్ష్మీ నర్సింహస్వామికి గొప్ప గుడి కట్టించిన చరిత్ర కేసీఆర్‌ది. మరి దాని ఫలితమైనా దక్కలేదు! స్వయంగా కిలో బంగారాన్ని సమర్పించాడు కూడా!” అన్నాడు నారదుడు.
లక్ష్మి చిన్నగా నవ్వింది.
”తన స్వప్రయోజనాలను, ఆశించి స్వార్థ చింత నతో గుళ్ళూ గోపురాలు కట్టించినచో మేము ప్రసన్న మవుతామని నమ్మటం మూర్ఖత్వం. గుడి కట్టించే టపుడు, బంగారాన్ని సమర్పించేటపుడు, భక్తుడు ఏమి ఆలోచిస్తున్నాడో తెలుసుకోని అమాయకు లమా మేము! గుళ్లు గోపురాలు కట్టించి, యజ్ఞ యాగాదులు చేసి, కానుకలు సమర్పించి. కష్టజీవుల పోరాటాలను, వారి హక్కులను కాలరాస్తే సహిస్తా మా? గుళ్లు కట్టించి, యాగాలు చేసి పుణ్యం సాధిం చుకున్నామని భావించుకుని, ఆ అహంకారంతో కష్ట జీవుల పోరాటాలను, హక్కులను అణచివేస్తే కలిగే పాపాలను గుర్తించకపోతే ఎట్లా? ఆ పుణ్యమూ దక్కదు, ఈ పాపఫలితమూ అనుభవించక తప్పదు. ఇది అందరూ తెలుసుకోవల్సిన సత్యము!” అన్నది లక్ష్మీదేవి.
”తల్లీ! ఇంకొక్క అనుమానమూ కలదు! దానినీ నివృత్తి చేయండి! ఇప్పుడు మీరు చెప్పినది. కేవలం తెలంగాణకు మాత్రమే వర్తించునా లేక యావత్‌ భారతదేశానికి వర్తించుతుందా?” అడిగాడు నారదుడు.
”ఇప్పుడు మేము చెప్పినది. యావత్‌ భారత దేశానికి వర్తించును. గుళ్ళూ గోపురాలు, యజ్ఞ యాగాలు కన్నా కష్టజీవుల చెమట చుక్కలే మిన్న. కార్మికులు, రైతులే సంపద సృష్టికర్తలు. కష్టజీవులకు మేలు జరిగితే సంతోషిస్తాము. వారికి నష్టం జరిగితే ఆగ్రహిస్తాము. అయితే కలియుగంలో ప్రజలే చరిత్ర నిర్మాతలు అది గుర్తెరిగి పాలించుట పాలకుల వంతు!” అన్నారు ముగ్గురమ్మలు.
నారదుడు కైలాసం నుండి బయలు దేరాడు.
– ఉషాకిరణ్‌