సఫారీ జోరు

Safari is intense– అఫ్గనిస్థాన్‌పై దక్షిణాఫ్రికా గెలుపు
– ఛేదనలో వాండర్‌ డుసెన్‌ మెరుపుల్‌
నవతెలంగాణ-అహ్మదాబాద్‌
సెమీఫైనల్‌ ముంగిట సఫారీ జోరు కొనసాగించింది. గ్రూప్‌ దశలో తన చివరి మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 245 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ వాండర్‌ డుసెన్‌ (76 నాటౌట్‌, 95 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్థ సెంచరీతో కదంతొక్కాడు. టెయిలెండర్‌ ఫెలుక్‌వయో (39 నాటౌట్‌, 37 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు), ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (41, 47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గనిస్థాన్‌ 244 పరుగులకు కుప్పకూలింది. 50 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసిన అఫ్గనిస్థాన్‌ నాణ్యమైన బౌలర్లను ఎదుర్కొని మంచి స్కోరు నమోదు చేసింది. అజ్మతుల్లా ఓమర్‌జారు (97 నాటౌట్‌, 107 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో అదరగొట్టాడు. ఛేదనలో చెలరేగిన వాండర్‌ డుసెన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. అఫ్గనిస్థాన్‌, దక్షిణాఫ్రికా తలపడిన ఈ మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 491 పరుగులు నమోదయ్యాయి. ఈ రెండు జట్ల ముఖాముఖిలో ఇదో రికార్డు. గ్రూప్‌ దశలో ఏడో విజయంతో దక్షిణాఫ్రికా రెండో స్థానంతో సెమీస్‌లో అడుగుపెట్టగా.. ఐదో పరాజయంతో అఫ్గనిస్థాన్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది.
డుసెన్‌ దూకుడు : ఛేదనలో దక్షిణాఫ్రికా దంచికొట్టింది. అఫ్గనిస్థాన్‌ పేసర్లు, స్పిన్నర్లు క్రమశిక్షణతో బంతులు వేయటంతో సఫారీ బ్యాటర్లు కాస్త ఆచితూచి ఆడారు. ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌ (41), తెంబ బవుమా (23)లు తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఓపెనర్లు సహా ఎడెన్‌ మార్క్‌రామ్‌ (25), హెన్రిచ్‌ క్లాసెన్‌ (10), డెవిడ్‌ మిల్లర్‌ (24) వికెట్‌ చేజార్చుకున్నా.. మరో ఎండ్‌లో వాండర్‌ డుసెన్‌ (76 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరిసిన డుసెన్‌ ఆఖరు వరకు క్రీజులో నిలిచి సఫారీలకు విజయాన్ని అందించాడు. టెయిలెండర్‌ ఫెలుక్‌వయో (39 నాటౌట్‌) చివర్లో డుసెన్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో 47.3 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా గెలుపొందింది. అఫ్గనిస్థాన్‌ బౌలర్లలో మహ్మద్‌ నబి, రషీద్‌ ఖాన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
అఫ్గనిస్థాన్‌ ఇన్నింగ్స్‌ : 244/10 (అజ్మతుల్లా ఒమర్‌జారు 97, రెహమత్‌ షా 26, గెరాల్డ్‌ 4/44, కేశవ్‌ మహరాజ్‌ 2/25)
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ : 247/5 (వాండర్‌ డుసెన్‌ 76, డికాక్‌ 41, ఫెలుక్‌వయో 39, మహ్మద్‌ నబి 2/35)