కదం తొక్కిన సఫాయన్న

Safayanna who trampled on the word– భారీ ర్యాలీలు, కలెక్టరేట్ల ముట్టడి
– పలుచోట్ల ఉద్రిక్తత
– అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిక
– కలెక్టర్లకు వినతిపత్రాలు
నవతెలంగాణ- విలేకరులు
తమ బతుకులను బాగు చేయాలని.. సమస్యలను పరిష్కరించాలని 26 రోజుల నుంచి సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్లకు కదం తొక్కారు. మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్మికులు భారీ ర్యాలీగా వెళ్లి కార్యాలయాల ఎదుట బైటాయించారు. వెంటనే సమస్యను పరిష్కరించకుంటే పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని, అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో పలుచోట్ల పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం కలెక్టర్లకు తమ గోడు వివరించి వినతిపత్రాలు అందజేశారు. జీపీ కార్మికులకు వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలతోపాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ తీశారు. గేటు ఎదుట బైటాయించి సుమారు మూడు గంటలపాటు ధర్నా చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శికూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, ప్రజాపంథా నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భం గా గ్రామ పంచాయతీ కార్మికుల, ఉద్యోగుల జిల్లా జేఏసీ చైర్మెన్‌ ఏజే రమేష్‌ అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడారు. ఎర్రజెండాలు అన్నీ కలిసి కార్మిక సమ్మెని ప్రజా ఉద్యమంగా మారుస్తాయని చెప్పారు. సమస్య పరిష్కారానికి సమ్మె చిట్ట చివరి ఆయుధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర జేఏసీని చర్చలకు పిలిచి సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. పోతినేని సుదర్శన్‌ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ.. పారిశుధ్య కార్మికుల కాళ్ళు కడిగి, తుడిచినా, సఫాయి అన్నా నీకు సలాం అని కేసీఆర్‌ అన్నా కార్మికుల కడుపు నిండదని అన్నారు. వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పిస్తేనే కడుపు నిండుతుందన్నారు.
గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికులు వేలాదిగా తరలివచ్చి సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిం చారు. పోలీసులకు, కార్మికులకు.. కార్మిక సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. సీఐ భానుప్రకాష్‌ చొరవ తీసుకొని జిల్లా పంచాయతీ రాజ్‌ అధికారిని పిలిపించారు. కార్మికులతో మాట్లాడించారు. కార్మికులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. కార్యాలయంలోకి సిబ్బంది వెళ్ల కుండా అడ్డుకున్నారు. షాద్‌నగర్‌లో జీపీ కార్మికులు వంటావర్పు చేసి నిరసన తెలిపారు. వికారాబాద్‌ జిల్లా తాండూర్‌ మండల కేంద్రంలో తలకిందులుగా నిలబడి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. హయత్‌ నగర్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వ హించారు. అంబేద్కర్‌ విగ్రహం వద్ద దహనం చేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని ఘట్‌కేసర్‌ లో కార్మికులు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు.
నల్లగొండ జిల్లా చండూర్‌లో ఎమ్మెల్యే కూసు కుంట్ల ప్రభాకర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నాంపల్లిలో జీపీ కార్మికులు పచ్చగడ్డి తింటూ నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రం లోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ ఎదుట పెద్దఎత్తున బైటాయించారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో బారికేడ్లను కార్మికులు బద్దలు కొట్టుకొని కలెక్టరేట్‌లోకి చోచ్చుకుపోయారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఐటీయూ నాయకులు కోడం రమణ స్వల్పంగా గాయపడ్డారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి బైటాయించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన కార్మికులు బైటాయించి ఆందోళన చేపట్టారు.
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట భజన కీర్తనలతోపాటు వంటావార్పు చేసి నిరసన తెలిపారు. దహెగాం మండలంలోనూ వంటావార్పు చేశారు. జనగామ జిల్లా నలుమూలల నుంచి వేలాది మందిఉదయాన్నే రైల్వే స్టేషన్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి డప్పు చప్పుళ్లు, ఆటపాటలతో కలెక్టరేట్‌ వరకు మహా ప్రదర్శన తీశారు. గ్రామపంచాయతీ కార్మికులు సఫాయీ దుస్తులు ధరించగా, మహిళా కార్మికులు చీపుర్లు చేతపట్టి ముందుకు కదిలారు. ఆర్టీసీ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి తమ గోడును వివరించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మికుల వద్దకు డీపీిఓ సూపరింటెండెంట్‌ వచ్చి వినతిపత్రాన్ని తీసుకున్నారు. ములుగు జిల్లాలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. వరంగల్‌ జిల్లాలో తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘం రాష్ట్ర జేఏసీ కన్వీనర్‌ చాగంటి వెంకటయ్య ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనగా వెళ్లి కలెక్టరేట్‌ ఎదుట బైటాయించారు. కలెక్టర్‌కు కార్మికులు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లేందుకు యత్నించగా.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. చివరకు ఐదుగురు సీఐటీయూ నాయకులు వెళ్లి వరంగల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీవత్సను కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌ శ్రీవత్స బయటకు వచ్చి కార్మికులతో మాట్లాడారు. హనుమకొండ కలెక్టరేట్‌ ముందు ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్‌ స్నిక్తా పట్నాయక్‌కు మెమోరాండం సమర్పించారు. మహబూబాబాద్‌లో భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.