– పరిశీలించిన సీడబ్ల్యుసీ, కేఆర్‌ఎంబీ సభ్యులు
– సీఆర్‌పీఎఫ్ బలగాల పహారా
– ఏపీకి కొనసాగుతున్న నీటి విడుదల
– ఇరు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు కేసు నమోదు
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ ప్రాజెక్టు డ్యామ్‌ను సీఆర్‌పీఎఫ్ బలగాలు ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనకు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంగీకరించిన నేపథ్యంలో సీఆర్పీఎఫ్ బలగాలు సాగర్ డ్యామ్ స్వాధీనం చేసుకున్నాయి. సీఆర్‌పీఎఫ్ బలగాల రాకతో.. తెలంగాణ పోలీసులు డ్యామ్ వద్ద నుంచి వెనుదిరిగారు. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు రైట్ బ్యాంక్ పరిసరాలలో మోహరించారు. మరోవైపు సాగర్ డ్యామ్ నుంచి కుడి కాలువకు నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. కుడి కాలువ ద్వారా ప్రస్తుతం 5,450 క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నట్టు సమాచారం.
డ్యామ్‌ను సందర్శించిన కేఆర్‌ఎంబీ సభ్యులు
సాగర్ డ్యామ్‌ను శనివారం కేఆర్‌ఎంబీ సభ్యులు ఎస్.సి అశోక్ కుమార్, ఈ.ఈ రఘునాథ్ సందర్శించారు. తెలంగాణ వైపు డ్యామ్‌ను సందర్శించిన అనంతరం ఆంధ్ర వైపు వెళ్లారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
తెలుగు రాష్ట్రాల పోటాపోటీ కేసులు
నాగార్జున సాగర్ డ్యాంపై తాజాగా చోటుచేసుకున్న పరిణామాల నేపధ్యంలో ఏపీ, తెలంగాణ పోలీసులు పరస్పరం తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. డ్యాంపైకి అక్రమంగా చొరబడి తమపై దాడి చేసి.. తమ విధులను ఆటంకపరిచి దౌర్జన్యంగా కుడి కాలువకు నీరు విడుదల చేశారన్న ఫిర్యాదుపై ముందుగా సాగర్ పోలీస్ స్టేషన్‌లో ఏపీ పోలీసులపై కేసు నమోదైంది. తెలంగాణ ఇరిగేషన్ అధికారులు, డ్యాం ఎస్‌పీఎఫ్ సిబ్బంది ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. ప్రతిగా సాగర్ డ్యాంపై తమ విధులను అడ్డుకున్నారని ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ పోలీసులపై రెండు కేసులు నమోదు చేశారు. నాగార్జున సాగర్ డ్యాం నిర్వాహణ హక్కులపై రేగిన తాజా వివాదంలో రెండు రాష్ట్రాల పోలీసులు పరస్పరం పోటాపోటీగా కేసులు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది.