సాయిబాబా నిర్బంధం సిగ్గుచేటు

– ఐరాస రిపోర్టర్‌ మేరీ లాలర్‌ వ్యాఖ్య
న్యూఢిల్లీ :ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాను ఇప్పటికీ నిర్బంధంలో ఉంచడం సిగ్గుచేటని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రిపోర్టర్‌ మేరీ లాలర్‌ వ్యాఖ్యానించారు. మానవ హక్కుల కోసం పోరాడుతున్న వారి పరిస్థితిపై ఆమె ఐరాసాకు నివేదిస్తుంటారు. సాయిబాబా నిర్బంధం ఆటవికం, మతిలేని చర్య అని లాలర్‌ విమర్శించారు. భారతదేశంలో దళితులు, ఆదివాసీలు సహా మైనారిటీల హక్కుల కోసం సాయిబాబా సుదీర్ఘ కాలం పోరాడారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని చాలా కాలంగా నిర్బంధంలో ఉంచడం సిగ్గుచేటని, విమర్శకుల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇదో ఉదాహరణ అని ఆమె తెలిపారు. తొంభై శాతానికి పైగా శారీరక వైకల్యంతో వీల్‌చైర్‌కే పరిమితమైన సాయిబాబా కారాగారంలో దుర్బర జీవితం గడుపుతున్నారు.
పలు సందర్భాలలో ఆయనకు వైద్య సాయాన్ని కూడా నిరాకరించారు. దీనిపై లాలర్‌ ఆందోళన వ్యక్తం చేస్తూ ‘అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అండా బ్యారక్‌లో సాయిబాబాను నిర్బంధించారు. ఆయన గదిలో కిటికీ లేదు. ఒక గోడ ఇనుప కడ్డీలతో నిర్మితమైంది. ఆ వాతావరణాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వేసవిలో పరిస్థితి దుర్భరం గా ఉంటోంది’ అని వివరించారు. ఖైదీలు, డిటెన్యూల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని, దివ్యాంగు లైన ఖైదీల విషయంలో వివక్ష జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వారికి సరైన నివాస సౌకర్యాలు కల్పించాల్సి ఉందని ఆమె తెలిపారు. నిర్బంధంలో ఉన్న సాయిబాబా ఆరో గ్యం క్షీణించిందని, ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరా రు. గతంలో కూడా దేశ విదేశాలకు చెందిన పలువురు మానవ హక్కుల కార్యకర్తలు సాయిబాబాను తక్షణమే విడుదల చేయా లని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.