మనిషి పుట్టాక మతం పుట్టింది ఆ మతాల ఉనికి కోసం మనుషులు మూర్ఖుల్లా మారి తమ అస్తిత్వాలను సైతం కోల్పోవడానికి సన్నద్ధులవుతున్నారు. కొందరు స్వార్ధపరులు మానవుల ఈ బలహీనతలను ఆయుధంగా మలచుకొని ఒకరిపై ఒకరు కాలుదువ్వి ఒకరి ప్రాణాలను మరొకరు తీయటమే కాక, ఆడవారిని, పసిపిల్లలను సైతం, ఈ దుష్టాద్నికి ఆహుతి చేస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం రగిలిన ఈ కారుచిచ్చును చల్లార్చడానికి కొందరి వేదనలోని ఆవేదనను వినిపించడానికి బాధను అక్షరాల్లో తొడిగి సమాజానికి చూపించే ప్రయత్నం చేసిన గొప్ప కవి కరిముల్లా. తెలుగు సాహిత్యంలో గురిపెట్టిన నిజాలతో నిక్కచ్చిగా వాస్తవాలను స్పృశించిన యదార్ధవాది.
భారతదేశాన్ని మాతృదేశంగా భావించి ఈ మట్టిలోనే ఒదిగిపోవాలని ఆలోచనలు దేహం నిండా నింపుకొని జీవిస్తున్నప్పుడు సాయిబుగా పుట్టడమే తప్పని నిలదీస్తున్న దుష్టశక్తులకు సమాధానంగా సాయిబు ఎదుర్కొంటున్న అసహనాన్ని ఆవేదనను వ్యక్తపరుస్తూ, నేనిప్పుడు నిర్వీక్షణ శిబిరంలో నా ఉనికి ఇప్పుడు ప్రశ్నార్ధకమైంది/ నా శ్వాస ఇక్కడ కౌంట్ డౌన్ లెక్కిస్తుంది/ మూలాన్ని తులుస్తున్న ఫ్యాన్సిస్ట్ వైరస్/ విశాల క్షేత్రాన్ని కబలిస్తుంటే మనిషి నెత్తుటికీ హద్దులు గీసిన అజ్ఞానం నన్ను తురకోడుంటుంది.
దేశ ప్రజల స్వేచ్ఛ, పేదల విముక్తి కోసం యుక్తవయసులోనే ఉరికొయ్యను ముద్దాడి, తన దేశభక్తిని నిరూపించిన అప్షకుల్లా ఖాన్ భారత పాకిస్థాన్ల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో దేశం తరఫున ప్రాణాలర్పించిన హమీద్, మస్తాన్వలిలు సాయిబులే కదా పీల్చిన ఊపిరికి అడుగులు మోసిన నేలతల్లి భారానికి కృతజ్ఞతగా ప్రాణాలర్పించిన మా ఉనికిని ప్రశ్నించి నేను ఏ దేశానికి చెందుతానో మూలాలను వెతికి లెక్కిస్తూ హద్దుల్లో జాతీయతను కొలవడం సమంజసమేనా అని ఒడ్డున పడి కొట్టుకుంటున్న చేప పిల్లలా తల్లాడిన ప్రతి ముస్లిం మనోవేదనను స్పృసించి కవి కలం ప్రశ్నిస్తోంది.
మీకు అర్ధం కాకపోవచ్చు ఫజర్ నుండి ఇషా వరకు పసీనాలో తడిసి తడిసి ముద్దయితే తల్వారై చీల్చే పదం ‘తురకోడు’
వేయి పడగలు విప్పిన పాము/ పంచేంద్రియాల్ని వెక్కిరిస్తుంటే/ భయం నీడలో నన్ను నేను/ ఆవిరి చేసుకుంటూ భరించిన పదం ‘తురకోడు’
కొద్దిగా చెప్పు/ ఎక్కడో వున్న టర్కీకి/ నాకు దారేందో చెప్పండి./ ఏ తురక పోలికా/ నా ముఖంలో…../ నీడగానైనా లేనప్పుడు/ నేనెట్లా తుకరనయ్యానో/ చెప్పండి.
ఈ పదాలు చదువుతున్నప్పుడు గుండెను పిండేసినట్లు అనిపిస్తుంది. భారత దేశంలో నివసించే భారతీయుడ్ని తురకోడు అని ఎందుకు అంటున్నారు..! మా బ్రతుకులు హాస్యమా..? మా చరిత్ర అపహాస్యమా..? టర్కీ వెళ్లాలంటే బస్సు ప్రయాణమో, రైలు ప్రయణమో, విమానమెక్కాలో కూడా తెలియని సాయిబుకు, టర్కీకి తురక పదానికి ఉన్న సంబంధము కూడా తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే… వెక్కిరింత, వెలివేత, తన దేశం నుండి, తన అన్నదమ్ములనుండి కట్టెలు చీల్చినట్లు చీల్చబడటం.
ఉగ్రవాదానికి, ఉన్మాదానికి నిర్వచనం అయినా తెలియని అమాయక సాయిబు పొద్దు పొడవకముందు (ఫజర్)మొదలు పొద్దుగూకే దాకా (ఇషా) వరకు పండ్లు, పూలు, కాయగూరలు, అమ్మటమే కాకుండా మాట్లు వేస్తూ, చెమటను చిందించటం మాత్రమే తెలిసిన తనకు వెక్కిరింతగా తురక అని పిలవబడినప్పుడు తమ ఆస్తిత్వాన్ని ఎవరో లాగేస్తున్నట్లు హృదయం బీటలు బారుతుంది. తురక ప్రజల రూపురేఖలకు మన భారతీయుల రూపురేఖలకు ఎంతో తేడా ఉంటుంది. పోలికల్లో, ఆలోచనల్లో, భారతీయత నిండి ఉన్నప్పుడు నేనెలా తురకనియ్యానంటూ నేరుగా తమ గుండెల్లో గుచ్చుకున్న గునపాల్లాంటి మాటల గాయాలను అందరి తరపున ఒక్కడై చూపించే ప్రయత్నం చేశాడు కవి.
నది జీవించడమంటే సముద్రం/ జీవించటమే నది మరణించడమంటే/ సముద్రం మరణించడమే/ ఈ వాస్తవాన్ని జీర్ణించుకోని/ మత పిశాచ పరివారాలు నాకు భయంకర వాదాన్ని గుజరాతి అద్దంలో చూపాయి.
గోదా ఎక్స్ప్రెస్ పేరుతో గోతులు తీశాయి. కొన్ని నదులు కలిస్తేనే కదా సముద్రం. నది మతం అయితే సముద్రాన్ని దేశంగా భావించి సముద్రం లాంటి దేశం సజీవంగా ఉండాలంటే నదుల్లాంటి మతాలు జీవంగా ఉండాలని ఐక్యత భావాన్ని చిత్రించాడు కవి. ఇస్లాం వాద సాహిత్యం రాసినందుకు కరిముల్లాను ఇస్లాం వాదిగా చెప్పవచ్చేమో కానీ అతను పూర్తిగా మానవతావాది. అతనికి కులం, మతం, అనే రంగు అంటలేదు. మనిషికి తగిలిన గాయం దాని తాలూకు చిలికిన రక్తాన్ని మాత్రమే తుడిచి, వాస్తవాలను తడుముతూ, తన కవిత్వం ద్వారా ప్రధమ చికిత్స చేసే ప్రయత్నం చేశాడని స్పష్టంగా అర్థం అవుతుంది.
హంతక ఐఎస్‌ఐ ముఠా ఉన్మాద క్రీడా షరా మామూలు అయింది. మతం వాసన ఎరుగని చిగురాకులు పండుటాకుల్లా రాలాయి.
ఖుర్ ఆన్ ముస్లిం గా ఎదగమంటే
ఆశల వృత్తంలో తిరుగుతున్నాం.
భయాల చట్రంలో మగ్గుతున్నాం
ముస్లిం అంటే ఎనలేని దైవ విధేయత,
దార్లు వేసుకొని దగ్గర అవడం హృదయాల విజేతలవ్వటం, మనుషులంతా ఒక్కటన్న ఖురాన్ భావాన్ని విశ్వసించటం.
నా హిందూ, నా ఈసాయి
సబలోగ్ హమారే భాయి హై…
ఏ దైవ గ్రంధమైనా మంచినే సూచిస్తుంది. మానవత్వాన్ని వారిలో నింపుతుంది. అల్లాV్‌ాను స్మరించినత మాత్రాన ముసల్మాన్ అయిపోరు. నీ చుట్టు పక్కల ఉన్న పొరుగిళ్ళలో తింటున్నారో, లేదో గమనించి వారిని ఆదరించమన్న హాదీసుల్లో కులాన్ని, మతాన్ని అడ్డుగోడగా చూపలేదు కదా! హిందూ, ఈసాయి అందరూ మన అన్నాదమ్ములే కదా! అంటున్న పంక్తులు చూస్తే కవి కేవలం అణచివేత, బాధ, కన్నీటికీ మాత్రమే స్పందిస్తాడని స్పష్టంగా తెలుస్తుంది. సాయిబు దీర్ఘకవిత లోని పన్నెండు భాగాలు, పద కొరడాలు ఝళిపిస్తూ వంద పేజీల్లో నిండిన సారం వందశాతం పాఠకుల హృదయాల్లో ఆలోచనా ధారలు కురిపిస్తుంది. కుల, మతాల వైషమ్యాల్లో చిక్కుకోకుండా ఐక్యతా దారులు తెరుస్తుంది.
– షేక్.నసీమాబేగం, 9490440865