లేని పోస్టుకు వేలల్లో జీతాలు

TSACS– నాకో ఆమోదం లేకున్నా టీశాక్స్‌లో ఇష్టారాజ్యం
– నిధుల దుర్వినియోగంపై పదే పదే ఆరోపణలు
– అయినా సరిదిద్దుకోని అధికారులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఒక లక్ష్యం కోసం ఏర్పాటైన ఆ పథకంలో అవినీతి అరోపణలు. తరచూ వివాదాలమయమే. ప్రజల్లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రచారం చేయడం, దాని నియంత్రణ, దాని బారిన పడిన వారికి సేవలందించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ పని చేస్తున్నది. దాని పరిధిలో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ మండలి పని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అసలు లక్ష్యసాధన దిశగా ఎంత సాధించారనే దాని కన్నా తరచూ అర్హత లేని వారికి పోస్టులను కట్టబెట్టడం, నిధుల దుర్వినియోగం, అమాత్యులకు బదిలీలు, అందలం ఎక్కించడం వంటి ఆరోపణలు నిత్యకృత్యంగా మారాయి. తమ అనుయాయుల కోసం నాకో విధించిన నిబంధనలను కూడా బేఖాతరు చేస్తున్నట్టు వినికిడి. రాష్ట్రంలో ఎయిడ్స్‌ నియంత్రణ మండలితో కలిసి పని చేస్తున్న స్వచ్ఛంధ సంస్థల సంఖ్య ఆధారంగా రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ పోస్టుల మంజూరు, వాటి సంఖ్యను నాకో నిర్ధారించింది. కనీసం వంద ఎన్జీవోలు ఉంటే వాటి పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో జేడీ (టీఐ) పోస్టు ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో అన్ని స్వచ్ఛంద సంస్థలు లేకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి నాకో ఈ పోస్టును రద్దు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పోస్టును భర్తీ చేసింది. అంతే కాకుండా ఆ లేనిపోస్టుకు ఎంతో అనుభవం ఉన్న వారిని తీసుకోవాల్సి ఉండగా కేవలం ఎన్జీవో అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకోవడమే కాకుండా ఆ వ్యక్తికి వేలల్లో జీతాలు చెల్లిస్తున్నట్టు సమాచారం. ఎంపిక విధానంలోని దరఖాస్తుదారులందరికి సమాచారం ఇవ్వకుండా ఒక్కరికే ఇచ్చి భర్తీ చేశారనే విమర్శలూ ఉన్నాయి. దీనికి తోడు టీశాక్స్‌లో ఏవైనా పోస్టులను భర్తీ చేయాలంటే అందుకు సంబంధించిన ప్రతిపాదన కాపీలను తప్పనిసరిగా అక్కడి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ లేదా అదనపు ప్రాజెక్టు డైరెక్టర్లకు తెలపాల్సి ఉంటుంది. అలా కాకుండా నేరుగా కంట్రీ డైరెక్టర్‌కు పంపించడం, అక్కడి నుంచి ఆయా పోస్టుల భర్తీకి ఆమోదం రాకపోవడం గమనార్హం. నాకో నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులు ఇలా నేరుగా పంపించడానికి వీలు లేదని సమాచారం. లంచాలకు అలవాటు పడిన అధికారులు జేడీ (టీఐ)ను వెనుకేసుకు వస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. ఇలాంటి వారికి అడ్డుకట్ట వేయకపోతే శాక్స్‌ నిధులు మరింత దుర్వినియోగమయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.