– వాహనదారుల కష్టాలు తీరేది ఎన్నడో
నవతెలంగాణ – శాయంపేట
శాయంపేట ఆత్మకూర్ మండలాలను కలుపుతూ మంజూరైన డబల్ రోడ్డు నిర్మాణం శాయంపేట గ్రామంలో నిలిచిపోయింది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి రోడ్డు నిర్మాణంలో ఇల్లు కోల్పోతున్న వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో, ఎట్టకేలకు స్వచ్ఛందంగా ఇండ్లు కూల్చి వేసుకున్నారు. విద్యుత్ స్తంభాల తొలగింపు కోసం గ్రామపంచాయతీ నుండి 6,45,000 నిధులు మంజూరు చేయగా, ఇటీవల విద్యుత్ స్తంభాల క్రమబద్ధీకరణను అధికారులు చేపట్టారు. రోడ్డు నిర్మాణానికి టెండర్ దక్కించుకున్న సంబంధిత కాంట్రాక్టర్ కంకర వేసి రోలింగ్ చేయించి వదిలిపెట్టారు. ఈ క్రమంలో ఆత్మకూరు నుండి వచ్చే కార్లు, భారీ వాహనాలు పాత పోలీస్ స్టేషన్ మూలమలుపు వద్ద రోడ్డు పెద్దగా ఉందని భావించి డ్రైవింగ్ చేస్తుండడంతో పక్కనే ఉన్న కాలువలో వాహనాల టైర్లు దిగబడుతున్నాయి. ప్రతిరోజు రెండు నుండి మూడు వాహనాలకు ఇదే పరిస్థితి నెలకొంటుందని గ్రామస్తులు తెలపడం గమనార్హం. మూలమలుపు వద్ద వాహనాలు నెమ్మదిగా రావడంతో ప్రాణా నష్టం జరగడం లేదని, అతివేగంగా వస్తే వాహనాలలో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా గండ్ర దంపతులు ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజల కష్టాలు తొలగించాలని కోరుతున్నారు.