మన శరీరానికి ఎన్నోరకాల ఆరోగ్యకర ప్రయోజనాలను అందించే సిరి ధాన్యాల్లో రాగులు కూడా చాలా ముఖ్యమైనవి. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. వయసు పెరిగే వారికి కూడా ఇందులోని కాల్షియం బాగా సహాయపడుతుంది. అలాగే మహిళల్లో ఎముకల పటుత్వానికి రాగులు ఎంతో మంచిది. ఈ చిరుధాన్యంలో కొవ్వు ఉండదు. పీచు, ఐరన్ కూడా ఎక్కువే. రోజువారీ ఆహారంలో వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం పెంచడంలో, బరువు తగ్గించడంలో సాయపడతాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వెజిటేరియన్లకు మంచి ప్రొటీన్ దొరికే ఆహారం ఇది. ఎన్నో పోషకాలున్న రాగులతో చేసే అల్పాహారాలు కొన్ని నేటి మానవిలో…
స్వీట్ అట్టు…
కావలసిన పదార్థాలు : రాగిపిండి – 500 గ్రాములు, బెల్లం : 25 గ్రాములు, నీళ్లు : తగినంత, నూనె : తగినంత, ఉప్పు : కొద్దిగా. యాలుకలు – రెండు.
తయారీ విధానం :
ముందుగా బెల్లంను నీటిలో కరిగించాలి.. ఈ నీటిలో రాగి పిండి, యాలుకల పొడి వేసి కలిపి బాగా కలపాలి. ఈ మిశ్రమం పలుచగా ఉండేటట్లు సరిచూసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకోవాలి. అది బాగా కాగిన తర్వాత గరిటతో కలిపి ఉంచిన పిండిని దోశెలా వెయ్యాలి. అట్టును రెండువైపులా కాల్చాలి.. అంతే రాగి స్వీట్ అట్టు రెడీ.. ఎంతో సింపుల్ గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చెయ్యండి.. తియ్యగా ఉంటుంది కాబట్టి పిల్లలూ ఇష్టంగా తింటారు..
పూరి..
కావలసిన పదార్థాలు : రాగి పిండి – 100 గ్రాములు, మైదా : 25 గ్రాములు, నూనె : 120 గ్రాములు, ఉప్పు : తగినంత, నీళ్లు : తగినంత.
తయారీ విధానం : ఒక గిన్నె తీసుకొని మైదా, రాగి పిండిలో ఉప్పు, తగినన్ని నీళ్ళు పోసి పూరి పిండిలాగా కలుపుకోవాలి. పిండిని అరగంటపాటు నాననివ్వాలి. ఉండల్లా చుట్టుకొని పూరీల్లా చేసుకోవాలి. ఈ పూరీలను బాగా మరిగిన నూనెలో వేయించుకోవాలి.. కాంబినేషన్‌గా పుదీనా చట్నీతో వీటిని తీసుకుంటే రుచి మరింత పెరుగుతుంది.
ఇడ్లీ..
కావలసిన పదార్థాలు : రాగి పిండి – 60 గ్రాములు, మినపపిండి – 20 గ్రాములు, ఉప్పు : తగినంత.
తయారీ విధానం : మినపప్పును నానబెట్టుకొని రుబ్బుకోవాలి. దీనికి రాగి పిండిని కలిపి సమపాళ్ళలో నీటిని కలిపి ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని రాత్రంతా నాననివ్వాలి. తరువాత రోజు ఇడ్లీ పాత్రలో ఇడ్లీలవలె పోసి 15 నిమిషాలు ఉడక నివ్వాలి. అల్లం చట్నీ, పల్లీ చట్నీలతో తింటే ఇడ్లీలు చాలా బాగుంటాయి. ట్రై చెయ్యండి..
ఉప్మా
కావలసిన పదార్థాలు : రాగి పిండి – ఒక కప్పు, ఆవాలు ఒక స్పూను, జీలకర్ర – ఒక స్పూను, నూనె – రెండు స్పూన్లు, పల్లీలు – రెండు స్పూన్లు, శనగపప్పు – కొంచెం, పచ్చిమిర్చి – 2, ఉల్లిపాయలు – ఒకటి సన్నగా తరుగుకోవాలి), కరివేపాకు – రెండు రెమ్మలు, కొత్తిమీర – చిటికెడు, ఉప్పు – అవసరమైనంత, నీరు – రెండు కప్పులు, నిమ్మరసం – ఒక స్పూన్
తయారీ విధానం : ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఒక స్పూన్ నూనె వేయాలి. వేడి అయిన తర్వాత రాగుల పిండిని వేసి సువాసన వచ్చేవరకు వేయించాలి. తర్వాత మరో కళాయిని స్టవ్ మీద పెట్టాలి. అందులో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, మిగిలినవి వేసుకుని వేయించాలి. వేగాక అందులో నీళ్లు పోసి నిదానంగా రాగుల పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు తక్కువ మంట మీద నీళ్లు ఆరిపోయే వరకు ఉడకనివ్వాలి. నీళ్ళు పూర్తిగా ఆరిపోయాక అందులో నిమ్మరసం, కొత్తిమీర చల్లి దింపితే రాగి ఉప్మా రెడీ.
పకోడీ…
కావలసిన పదార్థాలు:
రాగి పిండి – ఒక కప్పు, శనగపిండి – పావు కప్పు, ఉల్లిపాయలు – రెండు (సన్నగా పొడవుగా తరుగుకోవాలి), పచ్చిమిర్చి – నాలుగు, కొత్తిమీర – కొద్దిగా, జీలకర్ర – పావు టీస్పూన్, అల్లం – కొద్దిగా, ఉప్పు – రుచికి తగినంత, నూనె – వేయించడానికి తగినంత.
తయారీ విధానం: ఒక పాత్రలో రాగి పిండి, శనగపిండి (బెసన్), ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి బాగా కలపండి. నాలుగు స్పూన్ల నూనెను వేడి చేసి ఈ పిండిలో వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీరు పోసి ఉండలు లేకుండా మృదువైన ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దలో చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి మరొకసారి కలుపుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి, ఈ మిశ్రమాన్ని పకోడీల ఆకారంలో వేసి, రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. అంతే వేడి వేడి పకోడీ రెడీ.