సనాతన ధర్మం

 Sanatana Dharmaమూడు రోజుల నుండి ఇంట్లోని పాత సామాన్లలో ఏదో వెతుకుతున్నాడు రాములు. కాని అతను వెదుకుతున్నదేదో దొరకటం లేదు. అయినా వెదుకులాట ఆపలేదు. మూడురోజుల నుండి పెద్దగా పట్టించుకోని సీతకు ఈరోజు ప్రశ్నించక తప్పలేదు. ఎందుకంటే రాములు వెదుకులాట తర్వాత తనే సర్దుకోవాలి కదా!
”ఏందయ్యా మూడు రోజుల నుండి వెదుకుతున్నావు. ఇంతకూ ఏం కావాలి!” అడిగింది సీత.
సీత వంక సీరియస్‌గా మళ్ళీ వెదుకులాటలో మునిగిపోయాడు. దాంతో సీతకు చిరాకొచ్చింది.
”ఏం వెదుకుతున్నావో, ఏం కావాలో చెప్పవు. కాని ఇల్లంతా ఆగమాగం చేస్తున్నావు. ఇంక చాలు ఆపు! లేదా ఏం కావాలో చెప్పు! అన్నది కఠినంగా.
”కత్తి కోసం వెదుకుతున్నాను” అన్నాడు.
”కత్తి ఎందుకు? అన్నది ఆశ్చర్యంగా.
”తల నరకటానికి!” అన్నాడు కోపంగా
”తల నరకుతావా? ఎవరి తల? ఎందుకు నరుకుతావు!” మరింత ఆశ్చర్యంగా అడిగింది.
”ఆ ఉదయనిధిగాడి తల నరుకుతాను! వాడి తల నరికితే రూ.10కోట్లు ఇస్తానని స్వామి ఆదేశించాడు! స్వామిజీ ఆదేశం పాటించకపోతే పాపం తగులుతుంది!” అన్నాడు.
”ఉదయనిధి తల నరకటం ఎందుకు? అంత తప్పు ఆయనేం చేశాడు! అడిగింది.
”సనాతన ధర్మాన్ని రక్షించటం కోసం చంపుతాను! ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మం మనం రక్షిస్తుంది!” అన్నాడు.
”తల నరికితే నీవు హంతకుడవై, ఉరితీయబడతావు! నిన్ను ధర్మం ఎట్లా రక్షిస్తుంది?” అడిగింది.
”ఇదుగో నన్ను తికమక పెట్టకు! సనాతన ధర్మ పరిరక్షణలో నేను ఒక సమిధను అవుతాను. కాని ఆగేది లేదు!” మా నాయన చెప్పులు తయారు చేసేటప్పుడు వాడిన కత్తి ఎక్కడుంది? దాని కోసమే వెదుకుతున్నా!” అన్నాడు.
”సడన్‌గా మీ నాయన కత్తి గుర్తుకు వచ్చిందేమిటి? ఇప్పుడు నీవు ఉద్యోగం చేస్తున్నావు కదా?” అడిగింది.
”నేను కష్టపడి చదువుకున్నాను. కనక ఉద్యోగం వచ్చింది. అయినా దానికి దీనికి లింకు పెడతావేమిటి?” అన్నాడు.
”ఎందుకంటే సనాతన ధర్మం ప్రకారం నీవు శూద్రుడవు. చదువుకునే హక్కు లేదు! ఊరికి దూరంగా ఉండాలి. మూతికి ముంతా, వీపుకి చీపురూ కట్టుకోవాలి! ఊర్లోని అయ్యవార్లకు, దొరలకు, గులాంగిరీ చేయాలి! అదంతా మానేసి చదువుకోవటమే కాక ఉద్యోగం కూడా చేస్తావా? ఇదంతా సనాతన ధర్మానికి విరుద్ధం కాదా? నీవుముందు నీ ధర్మాన్ని ఆచరించు! ఆ తర్వాత తల నరకటం ఆలోచించవచ్చు!” అన్నది.
”మళ్ళీ నన్ను కన్ఫ్యూజ్‌ చేయకు! తల నరకాల్సిందే! ధర్మం పాటించాల్సిందే! అన్నాడు మొండిగా.
”నిజమే! స్వామిజీ అంటే సర్వసంగ పరిత్యాగి కదా! కామ, క్రోధ, మోహ, లోభ, మద, మంత్యర్యాలు, ఇహలోక సంగతులు అన్ని వదలిపెట్టాలి కదా!” అడిగింది.
”అవును! ఆ స్వామి సర్వసంగ పరిత్యాగి! అందుకే ఆయన షర్టు కూడా వేసుకోడు తెలుసా? అన్నాడు గర్వంగా.
”అవును షర్టు వేసుకోడు నిజమే! ఉదయనిధి ఫొటోను కత్తితో నరికేటంత క్రోథం ఉన్నది! ధర్మాన్ని రక్షించాలన్న మోహం ఉన్నది! ఎవరూ తల నరకకపోతే నేనే నరుకుతాను అన్నంత మదం ఉన్నది. సాటి మనుషుల పట్ల మత్సరం ఉన్నది. పదికోట్ల డబ్బు ఇవ్వగలిగే సంపద ఉన్నది. అన్ని త్యజిస్తేనే సన్యాసి అవుతాడు. కాని కాషాయ వస్త్రాలు కట్టుకుంటే సన్యాసి అవుతాడా? ఇంతకూ తల నరకమన్న స్వామి నిజంగా సన్యాసేనా లేక మాఫియా డానా? అడిగింది.
నిజంగానే కన్ఫూజ్‌ అయ్యాడు రాములు.
”ఏదేమైనా సనాతన ధర్మాన్ని తిట్టడం తప్పుకదా!” గొణిగాడు.
”నీవు అన్నది నిజమే! అంటరానితనాన్ని కుల వ్యవస్థను తిట్టాడు కాని మొత్తం ధర్మాన్ని తిట్టలేదే? పైగా కుల వివక్షను రూపుమాపితే రూ.20కోట్లు ఎదురు ఇస్తానన్నాడు కదా! దాని మీద ఎవరూ మాట్లాడటం లేదెందుకు?” అడిగింది.
రాములు కూడా మాట్లాడలేదు.
”నీవు కూడా మాట్లాడటం లేదు. అంటే అంటరానితనాన్ని, కుల వ్యవస్థను సమర్థిస్తున్నావన్న మాట! సనాతన ధర్మమంటే అనాదిగా ఉన్న ధర్మం అనీ, దాన్ని మార్చరాదని చెబుతున్నాడు కదా!” అన్నది.
అవునన్నట్లు తలూపాడు రాములు.
”మరి కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు వాడమని, ఉపగ్రహాలు పంపించమని, వాహనాల్లో, విమానాల్లో ప్రయాణం చేయమని సనాతన ధర్మంలో ఉన్నదా?” అడిగింది.
”అవన్ని కాలానుగుణంగా వచ్చిన మార్పులు! అభివృద్ధి! ధర్మం అభివృద్ధిని వ్యతిరేకించదు!” అన్నాడు.
”మరి కుల వివక్ష తప్పని, కుల వ్యవస్థను రద్దు చేసుకుందామని, చతుర్వర్ణ వ్యవస్థకు కాలం చెల్లిందని, సనాతన ధర్మపరిరక్షకులు ఎందుకు ప్రకటించలేదు! అంటే కాలానానుగుణంగా వచ్చే అభివృద్ధి కావాలి గాని, సాటి మనిషిని హీనంగా చూడటం తప్పు అనే మార్పు ధర్మంలో కాలానుగుణంగా ఎందుకు రాకూడదు?” అడిగింది.
రాములు అయోమయంలోనే ఉన్నాడు.
సనాతన ధర్మాన్ని వల్లెవేసే వారెవరూ ఈ విషయాలు మాట్లాడరు! కాని తల నరకమని ఆదేశాలు ఇస్తారు! అదే చాతువర్ణ వ్యవస్థలో దోపిడీకి గురి అవుతున్న నీలాంటీవారే కత్తులు పట్టుకుని బయలుదేరుతారు! ఇంకెన్నాళ్ళీ బానిస బతుకులు? ఒకరు ఆదేశిస్తే, అమలు చేయటానికి వెనకా ముందు ఆలోచించరా? విచక్షణ లేదా?” అడిగింది.
రాములు తలదించుకున్నాడు.
”తలదించుకోవటం కాదు! తలెత్తి ప్రశ్నించండి? ఎన్నాళ్ళీ బానిసత్వం! ఎంతకాలమీ వివక్ష? నరకటానికి కావాలంటే కత్తి ఇస్తాను! కాని దానితో తలలు నరకొద్దు! అంటరానితనాన్ని, కులవివక్షను, మనిషిని మనిషే దోచుకునే ఈ చాతువ్వర్ణ వ్యవస్థనే తెగనరకండి!” అంటూ కత్తి తెచ్చి పడేసింది సీత.

– ఉషాకిరణ్‌