సప్త విలాపం!

నవతెలంగాణ-హైదరాబాద్‌
– 
లక్నో ఖాతాలో ఆరో విజయం

– సన్‌రైజర్స్‌కు ఏడో పరాజయం
– ఛేదనలో పూరన్‌, ప్రేరక్‌ ధనాధన్‌
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సప్త విలాపం. సొంతగడ్డపై గెలుపు ఖాయం అనుకున్న మరో మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సీజన్లో ఏడో పరాజయంతో ఐపీఎల్‌16 ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. 183 పరుగుల ఛేదనలో ఓపెనర్లు వైఫల్యంతో లక్నోపై ఒత్తిడి పెరిగింది. డెత్‌ ఓవర్లలో సాధించాల్సిన రన్‌రేట్‌ భారీగా పెరిగిపోయింది. అయినా, నికోలస్‌ పూరన్‌ (44 నాటౌట్‌), ప్రేరక్‌ మన్కడ్‌ (64 నాటౌట్‌) సహా మార్కస్‌ స్టోయినిస్‌ (40) ధనాధన్‌ ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి పది ఓవర్ల శ్రమ వృథా అయ్యింది. డెత్‌ ఓవర్లలో విశ్వరూపం దాల్చిన నికోలస్‌ పూరన్‌ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్నో సూపర్‌జెయింట్స్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. సీజన్లో ఆరో విజయంతో లక్నో సూపర్‌జెయింట్స్‌ ప్లే ఆఫ్స్‌ దిశగా ఓ అడుగు ముందుకేసింది.

టర్నింగ్‌పాయింట్‌
15 ఓవర్లలో లక్నో స్కోరు 114/2. 30 బంతుల్లో 69 పరుగులు చేయాలి. 16వ ఓవర్లో బంతి అందుకున్న అభిషేక్‌ శర్మ ఏకంగా 31 పరుగులు సమర్పించుకుని.. మ్యాచ్‌ను లక్నో చేతుల్లో పెట్టాడు. ఆ ఓవర్లో తొలి రెండు బంతులను మార్కస్‌ స్టోయినిస్‌ సిక్సర్లు మలిచి.. మూడో బంతికి వికెట్‌ కోల్పోయాడు. ఓవర్లో చివరి మూడు బంతులను కొత్త బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ స్టాండ్స్‌లోకి పంపించాడు. దీంతో ఐదు సిక్సర్లు ఓ వైడ్‌తో అభిషేక్‌ 31 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్‌తో మ్యాచ్‌ లక్నో వశం కాగా.. సన్‌రైజర్స్‌ రేసు అక్కడితో ముగిసింది.
ఐపీఎల్‌లో నేడు
రాజస్థాన్‌ – బెంగళూర్‌
వేదిక : జైపూర్‌ , సమయం: మ: 3.30
చెన్నై – కోల్‌కత
వేదిక : చెపాక్‌, సమయం : రా: 7.30
స్టార్‌స్పోర్ట్స్‌,జియో సినిమాలో ప్రసారం
         అభిమానుల వీరంగం!
అభిమానుల అత్యుత్సాహం కారణంగా సన్‌రైజర్స్‌, సూపర్‌జెయింట్స్‌ మ్యాచ్‌ ఓ పది నిమిషాలు నిలిచిపోయింది. హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్లో మూడో బంతికి సమద్‌ హైట్‌ నోబాల్‌ సమీక్ష తీసుకున్నాడు. సమీక్షలో బంతి నో బాల్‌గా స్పష్టంగా తెలుస్తున్నా.. మూడో అంపైర్‌ ఆ బంతిని నో బాల్‌గా ఇవ్వలేదు. దీంతో అభిమానులు కాస్త ఆగ్రహానికి లోనయ్యారు. ఇదే సమయంలో లక్నో డగౌట్‌లో కూర్చున్న గౌతం గంభీర్‌ను ఉద్దేశించి ‘కోహ్లి.. కోహ్లి..కోహ్లి’ అని నినాదాలు చేసిన అభిమానులు ఆ జట్టు డగౌట్‌పై ఇనుప వస్తువులు విసిరారు!. ఇది గమనించిన ఫీల్డ్‌ అంపైర్లు లక్నో డగౌట్‌ దగ్గరకు వెళ్లారు. పరిస్థితి సద్దుమణిగేందుకు ఓ పది నిమిషాల పాటు మ్యాచ్‌ ఆగక తప్పలేదు.
లక్నో సూపర్‌జెయింట్స్‌ లక్ష్యం 183 పరుగులు. తొలి పది ఓవర్లలో ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయి 68 పరుగులే చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లు సమిష్టిగా విజృంభిస్తుండగా.. లక్నో సూపర్‌జెయింట్స్‌కు పరాజయం తప్పదేమో అనిపించింది. కానీ నికోలస్‌ పూరన్‌ (44 నాటౌట్‌, 13 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రేరక్‌ మన్కడ్‌ (64 నాటౌట్‌, 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్కస్‌ స్టోయినిస్‌ (40, 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఛేదనలో లక్నోను రేసులో నిలుపగా.. గెలుపు గీత దాటే బాధ్యత నికోలస్‌ పూరన్‌ తీసుకున్నాడు. పూరన్‌ పూనకాలతో 19.2 ఓవర్లలోనే లక్నో సూపర్‌జెయింట్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. ఓపెనర్‌ అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (36, 27 బంతుల్లో 7 ఫోర్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (47, 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అబ్దుల్‌ సమద్‌ (37 నాటౌట్‌, 25 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు) రాణించారు. లక్నో సూపర్‌జెయింట్స్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ ప్రేరక్‌ మన్కడ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. సీజన్లో 11 మ్యాచుల్లో ఏడో పరాజయం చవిచూసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. మిగతా మూడు మ్యాచుల్లో సన్‌రైజర్స్‌ మెరిసినా.. గరిష్టంగా 14 పాయింట్లు సాధించగలదు. సీజన్లో ఆరో విజయం సాధించిన లక్నో సూపర్‌జెయింట్స్‌ పాయింట్ల పట్టికలో టాప్‌-4లోకి తిరిగి ప్రవేశించింది.
పూరన్‌ పూనకాలు : 183 పరుగుల ఛేదనలో లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ (1/10) ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ (2)ను అవుట్‌ చేయగా.. క్వింటన్‌ డికాక్‌ (29) మయాంక్‌ మార్కండెకు వికెట్‌ కోల్పోయాడు. ఆరు ఓవర్లలో 30 పరుగులే చేసిన లక్నో సూపర్‌జెయింట్స్‌.. ఛేదనను క్లిష్టతరం చేసుకుంది. భువనేశ్వర్‌ కుమార్‌, ఫరూకీ, ఫిలిప్స్‌, నటరాజన్‌ ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. దీంతో పది ఓవర్ల అనంతరం లక్నో సూపర్‌జెయింట్స్‌ 68/2తో నిలిచింది. ద్వితీయార్థం మ్యాచ్‌ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్‌ గెలుపు దిశగా అడుగులేసింది. కానీ లక్నో సూపర్‌జెయింట్స్‌ తర్వాతి ముగ్గురు బ్యాటర్లు విశ్వరూపం చూపించారు. ఓ ఎండ్‌లో నం.3 బ్యాటర్‌ ప్రేరక్‌ మన్కడ్‌ (64 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన ప్రేరక్‌.. మార్కస్‌ స్టోయినిస్‌ (40)తో కలిసి మూడో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. స్టోయినిస్‌ మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో దండెత్తాడు. స్టోయినిస్‌ నిష్క్రమణతో నికోలస్‌ పూరన్‌ క్రీజులోకి రాగా.. మ్యాచ్‌ సమీకరణం పూర్తిగా మార్చివేశాడు. 13 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 44 పరుగులు పిండుకున్నాడు. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్నోకు విజయాన్ని అందించాడు. ఓ దశలో 42 బంతుల్లో 94 పరుగులు చేయాల్సి ఉండగా లక్నో సూపర్‌జెయింట్స్‌ తీవ్ర ఒత్తిడిలో పడింది. కండ్లుచెదిరే హిట్టింగ్‌తో చెలరేగిన నికోలస్‌ పూరన్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు పరాజయం మిగిల్చాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో ఫిలిప్స్‌, మార్కండె, అభిషేక్‌ ఒక్కో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు.
రాణంచిన క్లాసెన్‌, సమద్‌ : సొంతగడ్డపై టాస్‌ నెగ్గిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్‌ శర్మ (7) నిరాశపరిచాడు. అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (36, 27 బంతుల్లో 7 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. రాహుల్‌ త్రిపాఠి (20), కెప్టెన్‌ ఎడన్‌ మార్క్‌రామ్‌ (28) శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేదు. హెన్రిచ్‌ క్లాసెన్‌ (47, 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అబ్దుల్‌ సమద్‌ (37 నాటౌట్‌, 25 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు) మెప్పించారు. ఆరో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీ హైదరాబాద్‌కు భారీ స్కోరు అందించింది. ఈ ఇద్దరు క్రీజులో ఉండగా సన్‌రైజర్స్‌ 200 పైచిలుకు పరుగులు సాధించేలా కనిపించింది. లక్నో సూపర్‌జెయింట్స్‌ బౌలర్లు డెత్‌ ఓవర్లలో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబరిచారు. సమద్‌ నాలుగు సిక్సర్లు బాదగా.. క్లాసెన్‌ మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బ్యాటర్ల సమిష్టి ప్రదర్శనతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలుత 182 పరుగులు చేసింది. లక్నో కెప్టెన్‌, స్పిన్నర్‌ కృనాల్‌ పాండ్య (2/24) మాయజాలం ప్రదర్శించాడు. రెండు మెరుపు బంతులతో వికెట్లు పడగొట్టాడు. యుధ్‌వీర్‌ సింగ్‌, అవేశ్‌ ఖాన్‌, యశ్‌ ఠాకూర్‌, అమిత్‌ మిశ్రాలు ఓ వికెట్‌ పడగొట్టారు.
స్కోరు వివరాలు :
         సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ : అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (సి,బి) అమిత్‌ మిశ్రా 36, అభిషేక్‌ శర్మ (సి) డికాక్‌ (బి) యుధ్‌వీర్‌ సింగ్‌ 7, రాహుల్‌ త్రిపాఠి (సి) డికాక్‌ (బి) యశ్‌ ఠాకూర్‌ 20, ఎడెన్‌ మార్క్‌రామ్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) కృనాల్‌ పాండ్య 28, హెన్రిచ్‌ క్లాసెన్‌ (సి) ప్రేరక్‌ మన్కడ్‌ (బి) అవేశ్‌ ఖాన్‌ 47, గ్లెన్‌ ఫిలిప్స్‌ (బి) కృనాల్‌ పాండ్య 0, అబ్దుల్‌ సమద్‌ నాటౌట్‌ 37, భువనేశ్వర్‌ కుమార్‌ నాటౌట్‌ 2, ఎక్స్‌ట్రాలు : 05, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 182.
వికెట్ల పతనం : 1-19, 2-56, 3-82, 4-115, 5-115, 6-173.
బౌలింగ్‌ : యుధ్‌వీర్‌ సింగ్‌ 3-0-24-1, కైల్‌ మేయర్స్‌ 1-0-11-0, కృనాల్‌ పాండ్య 4-0-24-2, అవేశ్‌ ఖాన్‌ 2-0-30-1, యశ్‌ ఠాకూర్‌ 4-0-28-1, అమిత్‌ మిశ్రా 4-0-40-1, రవి బిష్ణోరు 2-0-23-0.
లక్నో సూపర్‌జెయింట్స్‌ : కైల్‌ మేయర్స్‌ (సి) మార్క్‌రామ్‌ (బి) గ్లెన్‌ ఫిలిప్స్‌ 2, క్వింటన్‌ డికాక్‌ (సి) అభిషేక్‌ శర్మ (బి) మయాంక్‌ మార్కండె 29, ప్రేరక్‌ మన్కడ్‌ నాటౌట్‌ 64, మార్కస్‌ స్టోయినిస్‌ (సి) అబ్దుల్‌ సమద్‌ (బి) అభిషేక్‌ శర్మ 40, నికోలస్‌ పూరన్‌ నాటౌట్‌ 44, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (19.2 ఓవర్లలో 3 వికెట్లకు) 185.
వికెట్ల పతనం : 1-12, 2-54, 3-127.
బౌలింగ్‌ : భువనేశ్వర్‌ కుమార్‌ 4-0-30-0, ఫజల్‌హాక్‌ ఫరూకీ 3.2-0-32-0, గ్లెన్‌ ఫిలిప్స్‌ 2-0-10-1, నటరాజన్‌ 4-0-31-0, మయాంక్‌ మార్కండె 3-0-39-1, అభిషేక్‌ శర్మ 3-0-42-1.