అస్సాంలో సాయ్ సెంటర్‌ చీఫ్‌ ఆగడాలు

మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులు
కోల్‌కత : ఓవైపు భారత అగ్రశ్రేణి రెజ్లింగ్‌ క్రీడాకారులు లైంగిక వేధింపులకు పాల్పడిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) లోక్‌సభ సభ్యుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలని న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నాలుగు వారాలుగా ఆందోళన చేస్తుండగా.. అస్సాంలోని సాయ్ (స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) సెంటర్‌ ఇన్‌చార్జి మహిళా అథ్లెట్లను లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృనాల్‌ బసుమతారి స్విమ్మింగ్‌ కోచ్‌ కాగా.. ప్రస్తుతం సొలాల్‌గోన్‌లోని సాయ్ ట్రైనింగ్‌ సెంటర్‌ (ఎస్‌టీసీ) ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతల్లో ఉన్నారు. మహిళా అథ్లెట్లను లైంగిక వేధింపులకు గురి చేస్తుండటంతో తొలుత వెయిట్‌లిఫ్టింగ్‌ కోచ్‌ ఫిర్యాదు చేసింది. తాజాగా ఓ మహిళా రెజ్లింగ్‌ కోచ్‌ సైతం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ‘గురువారం మధ్యాహ్నాం లైంగిక వేధింపులపై ఫిర్యాదు అందింది. వెంటనే పాల్టన్‌ పోలీసు స్టేషన్‌లో మృనాల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఫిర్యాదు చేశామని’ సాయ్ రీజినల్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సత్యజిత్‌ తెలిపారు. మహిళా అథ్లెట్లు, కోచ్‌లు ఫిర్యాదు చేసినా.. మృనాల్‌పై ఇప్పటివరకు శాఖపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అతడిపై సారు అధికారులు సస్పెన్షన్‌ విధించలేదు. మృనాల్‌పై ఫిర్యాదు చేసిన వారిలో అధికశాతం మైనర్‌ అథ్లెట్లు ఉండటం శోచనీయం.