మోదానీ నుంచి దేశాన్ని కాపాడండి

Medha Patkar Book Releae– న్యాయవ్యవస్థ సకాలంలో స్పందించాలి
– మేం ఆందోళన జీవులమే…
– ప్రముఖ పర్యావరణ వేత్త మేథాపాట్కర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
”భారతదేశ ఆర్థిక వ్యవస్థ కేవలం అదానీ, అంబానీలది మాత్రమే కాదు. దేశ సంపదను వారికి దోచిపెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ శక్తివంచన లేకుండా తాపత్రయపడుతున్నారు. కరోనా టైంలోనూ వారికే దేశ ఆర్థిక వ్యవస్థను ధారాదత్తం చేశారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పీడిత, తాడిత ప్రజలది కూడా. ఆ విషయాన్ని ప్రధాని మోడీ మర్చిపోయారు. దాన్ని గుర్తుచేయాల్సిన అవసరం వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆ దిశగా చైతన్యవంతులు అవ్వాలి. దానికోసం మేం ఆందోళన జీవులుగానే బ్రతుకుతాం” అని నేషనల్‌ అలయెన్స్‌ ఆఫ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్స్‌ నాయకురాలు, ప్రముఖ పర్యావరణవేత్త మేథాపాట్కర్‌ అన్నారు. రాంమనోహర్‌ లోహియా సమతాన్యాస్‌, లోహియా విచార్‌ మంచ్‌ సంయుక్తాధ్వర్యంలో శనివారంనాడిక్కడి శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయంలో ‘రాజకీయాల్లో మధు ధ్వయం’ (తెలుగు, ఆంగ్లం) పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. ప్రముఖ సోషలిస్ట్‌ నాయకులు మధు లిమాయే (1922-1995), మధు దండావతే (1924-2005) శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఈ సందర్బంగా మేథాపాట్కర్‌ మాట్లాడుతూ ఆనాటి రాజకీయ పరిస్థితులు, విలువలను గుర్తుచేశారు. కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదం లేని సమాజాన్ని సోషలిస్టులు కాంక్షిస్తున్నారని తెలిపారు. కానీ ఇప్పటి రాజకీయాలు దీనికి పూర్తి భిన్నంగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్‌బ్యాంక్‌ రాజకీయాలు పెరిగాయనీ, విధానాలు లేని రాజకీయాలు అధికారంలోకి వస్తున్నాయని అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ కంటే ఇప్పుడు మరింత ప్రమాదకరమైన ఎమర్జెన్సీ దేశంలో నడుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని చెప్పారు. ”ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. రేపు ఏ జైలులో ఉంటామో తెలీదు” అని కేంద్రం అమలు చేస్తున్న ‘ఉపా’ చట్టాన్ని ప్రస్తావిస్తూ అన్నారు. ఎలాంటి ట్రయల్స్‌ లేకుండా ఆదివాసీ నేతలు మొదలు ఢిల్లీ ప్రొఫెసర్ల వరకు ఈ చట్టం ద్వారా ఏండ్ల తరబడి జైళ్లలో వేస్తున్నారనీ, ఇంతకంటే దుర్మార్గం ఏముందని ప్రశ్నించారు. విధాన వ్యతిరేకతను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సహించలేకపోతున్నదని విమర్శించారు. చార్‌ధామ్‌ యాత్ర పేరుతో సహజ వనరులు, పర్యావరణాన్ని పూర్తిగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారనీ, దాని పర్యవసానంగానే ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో వరదలు, విధ్వంసాన్ని చూస్తున్నా మని ఉదహరించారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, ఓట్లను రాబట్టుకొనే దుర్మార్గ రాజకీయం నడుస్తున్నదనీ, దీన్ని కచ్చితంగా అడ్డుకోవల్సిందేనని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ కూడా సకాలంలో న్యాయాన్ని అందించలేకపోతున్నదన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే సామాన్య, పేద ప్రజలే తీవ్రంగా నష్టపోతున్నారనీ, దీనికి కోర్టు తీర్పుల జాప్యం కూడా కారణమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా దేశంలోని కరెన్సీ నోట్లపై వినాయకుడి ఫోటోలు ముద్రించాలా… శ్రీకృష్ణుడి ఫోటోలు ముద్రించాలా… అనే చర్చను జనంలో పెడుతున్నారనీ, ఇంతకంటే తిరోగమనం ఏమున్నదని అన్నారు. దేశంలో రోజుకు రెండువేల మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారనీ, జీఎస్టీ దెబ్బకు చిరు వ్యాపారులు బిత్తరపోతున్నారని అన్నారు. కేంద్రంలోని పాలకులు దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. ఒడిశాకు చెందిన ప్రముఖ పర్యావరణ వేత్త ప్రఫుల్ల సమాంతర మాట్లాడుతూ ఇప్పటి ప్రజా ప్రతినిధులు పార్టీలు మారడాన్ని తప్పుగా భావించట్లేదనీ, జనం గోసకంటే వ్యక్తిగత స్వార్థాలు రాజకీయాల్లో పెరిగిపోయాయని అన్నారు. కేంద్రంలో జనతా ప్రభుత్వ హయాంలో క్లాస్‌లెస్‌ రైలును ప్రవేశపెట్టిన ఘనత సోషలిస్టులదేనని తెలిపారు. దేశం రాజకీయ విలువలను కోల్పోతున్నదనీ, అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్నదని చెప్పారు. 2024లో ఫాసిజాన్ని నియంత్రిస్తూ తీర్పు వస్తే, అదే మధు లిమాయే, మధు దండావతేలకు అసలైన నివాళి అని అన్నారు. కార్యక్రమానికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బీ సుదర్శన్‌రెడ్డి అధ్యక్షత వహించారు. న్యాయవాది రఘుకుమార్‌ పుస్తకపరిచయం చేశారు. మాజీ ఎమ్మెల్సీ కే యాదవరెడ్డి, సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే సునీలం, రాంమనోహర్‌ లోహియా సమతాన్యాస్‌ మేనేజింగ్‌ ట్రస్టీ అక్షరు ఎస్‌ పిట్టి తదితరులు మాట్లాడారు.