సావిత్రీబాయి ఫూలేపై అవాకులు…చవాకులు

avitribai Phule– కించపరిచేలా వ్యాసాలు
– రెండు వెబ్‌సైట్లపై కేసులు
ముంబయి : భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, విద్యావేత్త, కవయిత్రి సావిత్రీబాయి ఫూలేకు దురుద్దేశాలు ఆపాదిస్తూ ఇండియా టేల్స్‌, హిందూ పోస్ట్‌ వెబ్‌సైట్లలో ప్రచురితమైన అభ్యంతరకరమైన, అడ్డగోలు వ్యాసాలపై ముంబయిలో తీవ్ర నిరసన ధ్వనులు విన్పిస్తున్నాయి. ‘సావిత్రీబాయి ఫూలేకు ముందు గుర్తింపు లేని హిందూ మహిళా ఉపాధ్యాయులు’ అనే పేరుతో ప్రచురితమైన వ్యాసాలలో…ఆమె పాఠశాల బ్రిటన్‌ మిషనరీల స్పాన్సర్‌షిప్‌ పొందిందని ఆరోపించారు. తద్వారా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచారు. బ్రిటీష్‌ పాలకులు తమ సైనికుల లైంగిక అవసరాల కోసం భారతీయ మహిళలను వినియోగించారని కూడా ఆ వ్యాసాలలో అవాకులు చవాకులు పేల్చారు. అసలు సావిత్రీబాయి ఫూలే భారత దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలేనా అని హిందూ పోస్ట్‌ జనవరి ఐదవ తేదీన ప్రచురించిన వ్యాసంలో అనుమానం వ్యక్తం చేసింది. వాస్తవానికి బెంగాలీ హిందూ వితంతువు అయిన హోతీ విద్యాలంకర్‌ దేశంలోనే తొలి మహిళా అధ్యాపకురాలని ఆ వెబ్‌సైట్‌ తెలిపింది. సంస్కృత కవిత్వం, న్యాయ శాస్త్రం, గణితం, ఆయుర్వేదంలో ఆమె గొప్ప పండితురాలని కీర్తించింది. అదే సమయంలో సావిత్రీబాయి ఫూలే బ్రిటీష్‌ వలసవాద పాలనను, క్రైస్తవాన్ని కీర్తిస్తూ కవితలు రాశారని ఆరోపించింది. ఈ వ్యాసాలపై ఎన్సీపీకి చెందిన సీనియర్‌ నేతలు, అనేక సామాజిక సంస్థలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. వెబ్‌సైట్ల పైన, వ్యాసాలు రాసిన రచయితల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. అయినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
దీంతో జాప్యాన్ని నిరసిస్తూ గత నెల 27న మరోసారి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో మహారాష్ట్ర హోం మంత్రి, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ శాసనసభలో స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యాసాలు రాసిన వారిని గుర్తించేందుకు పోలీసులు ట్విటర్‌ ఇండియాను సంప్రదిస్తు న్నారని చెప్పారు. ట్విటర్‌, వెబ్‌సైట్ల పైన కేసులు కూడా నమోదు చేశామని తెలిపారు. బాధ్యులను గుర్తించిన వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు. మంత్రి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్ష సభ్యులు సభ నుండ వాకౌట్‌ చేశారు. మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్‌ గాంధీపై వెంటనే చర్యలు తీసుకున్న ప్రభుత్వం, ఇప్పుడు దోషులపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. కాగా సావిత్రీ బాయి ఫూలేపై ప్రచురించిన వ్యాసాన్ని తొలగించామని ఇండియా టేల్స్‌ వివరణ ఇచ్చింది. మరోవైపు ఇండియా టేల్స్‌, హిందూ పోస్ట్‌, ట్విటర్‌ ఇండియాలపై ఆజాద్‌ మైదాన్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు.