– క్యూ2లో నికర లాభాల్లో 28 శాతం వృద్థి
– నికర వడ్డీ ఆదాయం రూ.41,620 కోట్లు
– తగ్గిన మొండి బాకీలు
ముంబయి : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 28 శాతం వృద్థితో రూ.18,331 కోట్ల నికర లాభాలు సాధించింది. రూ.15,500 కోట్ల లాభాలు ప్రకటించే అవకాశం ఉందని వచ్చిన అంచనాలకు.. మించి మెరుగైన ఫలితాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.14,330 కోట్ల లాభాలు నమోదు చేసింది. కాగా.. క్రితం క్యూ2లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 5 శాతం పెరిగి రూ.41,620 కోట్లకు చేరింది. 2023-24 ఇదే క్యూ2లో రూ.39,500 కోట్ల ఎన్‌ఐఐ ప్రకటించింది.
గడిచిన సెప్టెంబర్ త్రైమాసికంలో ఎస్‌బిఐ స్థూల రుణాలు 15 శాతం పెరిగి రూ.39.2 లక్షల కోట్లకు చేరాయి. డిపాజిట్లు 9 శాతం వృద్థితో రూ.51.17 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. క్రితం క్యూ2లో వ్యక్తిగత రుణాలు 13.66 శాతం పెరిగి రూ.7,64,141 కోట్లుగా నమోదయ్యాయి. కరెంట్ ఎకౌంట్, సేవింగ్ ఎకౌంట్ డిపాజిట్లు 4.24 శాతం వృద్థితో రూ.19,65,899 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 2.13 శాతానికి తగ్గాయి. గతేడాది ఇదే త్రైమాసికం ముగింపు నాటికి 2.55 శాతం ఎన్‌పీఏలు నమోదయ్యాయి. ఇదే సమయంలో 0.57 శాతంగా ఉన్న నికర నిరర్థక ఆస్తులు 0.53 శాతానికి తగ్గాయి. పారు బకాయిల కోసం రూ.4,506 కోట్ల కేటాయింపులు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణాల్లో 14-16 శాతం వృద్థి ఉండొచ్చని ఎస్‌బీఐ చైర్మెన్ సిఎస్ శెట్టి పేర్కొన్నారు. అయితే డిపాజిట్లలో మాత్రం 10-11 శాతం పెరుగుదల ఉండొచ్చని.. ఇంతక్రితం ఈ అంచనా 12-13 శాతంగా ఉందన్నారు. కార్పొరేట్ల రుణాల్లో తగ్గుదల ఉండొచ్చని శెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. అన్‌సెక్యూర్డ్ రుణాల్లోనూ మందగింపు చోటు చేసుకోవచ్చన్నారు.