ఎస్సీ వర్గీకరణ చేపెంతవరకు పోరాటం..

– ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ – ధూల్ పేట్: ఎస్సీ వర్గీకరణ చేపెంతవరకు పోరాటం ఆగదని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం జియాగూడ డివిజన్ ఇందిరానగర్ అదిజాంభవ సంక్షేమ సంఘం కమ్యూనిటి హాల్ వద్ద మాదిగ కులస్థులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ నిర్వహిస్తేనే ప్రభుత్వాలకు పుట్టగతులు ఉంటాయన్నారు. వెంటనే ఎస్సీ వర్గీకరణ చేయాలన్నారు. దీనికై ఈ నెల 11వ తేదిన ఎమ్మార్పీఎస్ తలపెట్టిన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే విశ్వరూప మహాసభకు మాదిగ కులస్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన అన్నారు. విశ్వరూప మహాసభకు దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడి ముఖ్య అతిథిగా హాజకరై వర్గీకరణ విషయంపై మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగ జాతికి మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదిజాంభవ సంక్షేమ సంఘం ప్రతినిధులు కేశవ్, సురేష్, కుమార్, చెన్నయ్య, వెంకటేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు చంద్రమోహన్ మాదిగ, మీరియాల నవీన్ కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.