ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై ఉలికిపాటెందుకు?

– మంత్రి ఈశ్వర్‌కు జీవన్‌రెడ్డి ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఉలికిపాటెందుకు? అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలోనే దళిత సంక్షేమం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఊళ్ళో కాంగ్రెస్‌ ఓట్లు అడగబోదనీ, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఉన్న ఊళ్ళో కేసీఆర్‌ ఓటు అడగాలని సవాల్‌ విసిరారు. దళితులకు భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్‌ ప్రభుత్వాలదేనన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో కొత్తగా ఒక్కరికీ రేషన్‌ కార్డు ఇవ్వలేదన్నారు. దళితులకు పెరిగిన జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు.
వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నారో తెలియదు :
కోదండరెడ్డి, అన్వేష్‌రెడ్డి
కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో కేసీఆర్‌…విదేశాల్లో కేటీఆర్‌…కానీ వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నారో తెలీయదని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ నేత కోదండరెడ్డి ఎద్దేవా చేశారు. వర్షాభావంతో రాష్ట్రంలో పంటలు ఆగమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌ నగర్‌ జిల్లాలో పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కిసాన్‌ కాంగ్రెస్‌ చైర్మెన్‌ అన్వేష్‌రెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం చెప్పటం వల్లే వరి, పత్తి పంటలు కాకుండా ఇతర పంటలు వేశారని తెలిపారు. పంటలు ఎండిపోతుంటే ఆలయాల్లో పూజలు చేయాలని చెప్పటం హాస్యస్పందమన్నారు.