పండితులు, పీఈటీలకు వెంటనే పదోన్నతులివ్వాలి

– మిగిలిన వారిని స్కూల్‌ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్‌ చేయాలి : టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైకోర్టు తీర్పునకు అనుగుణంగా అప్‌గ్రేడెడ్‌ పండితులు, పీఈటీ పోస్టులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. పదోన్నతులు పొందగా మిగిలిన పండితులు, పీఈటీలను స్కూల్‌ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్‌ చేయాలని కోరింది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జీవోనెంబర్‌ 15 ద్వారా స్కూల్‌ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్‌ చేసిన 10,479 భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులకు హైకోర్టు తీర్పు ప్రకారం ప్రస్తుత షెడ్యూల్‌లోనే పదోన్నతులు కల్పించాలని కోరారు. అప్‌గ్రేడ్‌ అయిన పోస్టుల్లో పదోన్నతి రాకుండా మిగిలిపోయిన భాషాపండితులు, పీఈటీలకు సమాన సంఖ్యలో ఎస్జీటీ పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వేజెస్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌గా అప్‌గ్రేడ్‌ చేసి సవరించిన సర్వీసు నిబంధనల జీవో నెంబర్‌ రెండు, మూడుల ప్రకారం భాషాపండితులకు, జీవోనెంబర్‌ తొమ్మిది, పదిల ప్రకారం పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని సూచించారు. సర్వీసు నిబంధనలు సవరించకుండా లేదా నూతన సర్వీసు నిబంధనలు రూపొందించకుండా భాషాపండితులకు న్యాయం జరగదని గతంలో తాము చేసిన సూచనను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని తెలిపారు. కొందరి తాత్కాలిక ప్రయోజనాలకోసం ముందుచూపు లేకుండా హడావుడిగా 2017లో ఒకసారి, 2019లో మరోసారి అప్‌గ్రేడ్‌ చేసిన ఫలితంగా ఏర్పడిన న్యాయవివాదం పరిష్కారం కావటానికి ఆరేండ్లు పట్టిందని పేర్కొన్నారు. అర్హతకలిగిన ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పై కోర్టులకు వెళ్లి ఇంకా ఈ వివాదాన్ని కొనసాగించటంకంటే ప్రభుత్వమే చొరవ తీసుకుని మరికొన్ని పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయటం ద్వారా సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు.