
జిల్లాలోని 9సినిమా హాళ్లలో ఉచితంగా ప్రదర్శిస్తున్న గాంధీ చలన చిత్రాన్ని బుధవారం 25 పాఠశాలలకు చెందిన 5,074 మంది విద్యార్థిని, విద్యార్థులు తిలకించారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులలో జాతీయ భావం పెంపొందించేలా ఉచితంగా గాంధీ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసిందన్నారు. ఈ నెల 14 నుంచి 24 వరకు (9) ప్రభుత్వ పని దినాలలో చిత్ర ప్రదర్శన జరుగుతుందన్నారు. ప్రతి రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు చిత్ర ప్రదర్శన ఉంటుందని చెప్పారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ (9) సినిమా హాళ్లలో సీటింగ్ కెపాసిటీ మేరకు విద్యార్థులు చిత్రాన్ని తిలకించుటకు పాఠశాలల వారీగా షెడ్యూల్ రూపొందించారని అన్నారు. రవాణా, రెవెన్యూ, పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విజయవంతంగా చిత్ర ప్రదర్శనకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. కామారెడ్డి లోని ప్రియ 70ఎంఎం, ప్రియ 35 ఎంఎం, దర్శన్, శాంతి థియేటర్లలో, బాన్సువాడలో మహేశ్వరి, వెంక టేశ్వర, బిచ్కుంద లోని పరమేశ్వరి, పిట్లం లోని శ్రీ వెంకటేశ్వర, నాగిరెడ్డిపేటలోని రామ్ ప్రతాప్ థియేటర్లలో చిత్ర ప్రదర్శన జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. బుధవారం దర్శన్, ప్రియ 70 ఎంఎం లో మండల విద్యాధికారి ఎల్లయ్య, విద్యార్థులతో గాంధీ చిత్రాన్ని వీక్షించారు.