అన్వేషణ

kavithaచెప్పుల్లో బంధీలైన పాదాలకు
ఒక్కసారైనా స్వేచ్చనిచ్చి
మట్టిని పలకరిద్దామని చూశాను!

నేలతల్లి గుండెలపై
చిట్టి పాదాల మెత్తటి అడుగుల సవ్వడి
ఒక్కసారైనా విందామని చూశాను!

నాగరికత అద్దిన అందాల జాడ తప్పా
కంటికి మట్టిజాడ కనబడలేదు,
అడుగులు ముందుకు వేయాలంటే
కాళ్ళు కూడా కదలడం లేదు!

కొండలన్నీ మాయమై
మేడలు ఆకాశానికి మెట్లయ్యాయి,
చెట్లన్నీ కూలిపోయి
వాటి స్థానంలో పాతిన రాళ్లు
మౌనం పాటిస్తున్నాయి!

కొమ్మలను మరిచిన పట్నపు పక్షులు
భవనాలపై వరుసగా వాలి
వాటి దర్పాన్ని చూపిస్తున్నాయి!

చినుకులు రాలినా
భూమాతకు దాహం తీరలేదు,
తన గొంతుకు పొరలుపొరలుగా
ఎన్నో అడ్డుగోడలు పేర్చారు,
తన మెత్తని హదయం కూడా
కటువుగా మారిపోయింది!

పగిలిన గుండెతో
అద్దాల మేడల్లో తన అందాన్ని చూసుకొని
మురిసిపోతోంది నగరం,
నగరం ఆభరణమే కానీ
మనిషికి మట్టికి మించిన ఆభరణం ఏముంది!

– పుట్టి గిరిధర్‌, 9494962080