– ఏం రిపోర్టు ఇస్తారు?
– వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలనకు వచ్చిన.. వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఉప్లూర్ రైతుల సూటి ప్రశ్న
– అధికారులపై రైతుల ఆగ్రహం
నవతెలంగాణ-కమ్మర్‌పల్లి
దున్నేసిన పంటను చూసి ఇప్పుడు ఏం రిపోర్టు ఇస్తారని వ్యవసాయ శాస్త్రవేత్తలను ఉప్లూర్ రైతులు సూటిగా ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని ఉప్లూర్‌లో గ్రామంలో నకిలీ విత్తనాలతో, వర్షాలతో దెబ్బతిన్న సోయాపంటను పరిశీలించేందుకు శాస్త్రవేత్తల బృందం, వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించారు. కాగా, అప్పటికే గ్రామంలో అనేక మంది రైతులు సోయా పంట పూత, కాత రాకపోవడంతో దున్నేశారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు అధికారులు ఇప్పుడొచ్చి పంటలను పరిశీలించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో అందరూ రైతులు ఖరీఫ్ మెట్ట పంటగా సోయాబీన్ పంటను సాగు చేశారు. సోయాబీన్ పంటలో కొన్ని రకాలు పూత, కాత మొత్తం రాలేదు. కొన్ని రకాలు మంచి పంట వచ్చింది. ఈ పంట రాని విత్తనాలు రైతులను ప్రతేడాది నిండా ముంచుతున్నాయని కొద్ది రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగా వ్యవసాయ పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త బాలాజీ నాయక్, రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అంజయ్య, శాస్త్రవేత్తలు విజరు కుమార్, దినేష్‌ను భీంగల్ ఏడీఏ మల్లయ్య బుధవారం గ్రామానికి తీసుకొచ్చారు. అయితే ఇప్పటికే పూర్తిగా నష్టపోయిన రైతులు సోయా పంటను దున్నేశారు. దున్నేసిన పంటను శాస్త్రవేత్తలు, అధికారులు వచ్చి పరిశీలించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దున్నేసిన పంటను ఇప్పుడు వచ్చి ఏమని రిపోర్టు ఇస్తారని ప్రశ్నించారు. రైతులను నిండా ముంచుతున్న నకిలీ విత్తన కంపెనీలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని శాస్త్రవేత్తలను, అధికారులను నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని, నకిలీ విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.