వాహన తనిఖీల్లో నగదు పట్టివేత

Seizure of cash in vehicle inspections–  సరైన పత్రాలు లేకపోవడంతో స్వాధీనం
నవతెలంగాణ- విలేకరులు
ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో సరైన పత్రాలు చూపని వారి నుంచి నగదును స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అప్పగించారు. హైదరాబాద్‌లో నార్త్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు, బంజారాహిల్స్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు దొరికింది. కియా వాహనంలో రూ.3 కోట్ల 35 లక్షలను స్వాధీనం చేసుకున్నట్టు వెస్ట్‌ జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి మండలంలో మేడిపల్లి పోలీసులు, ఎస్‌ఓటి మల్కాజిగిరి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఓ వాహనంలో 6,01,940 నగదును స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట లింగాపూర్‌ తండాలోని అంతర్‌ జిల్లా చెక్‌ పోస్ట్‌ వద్ద తనిఖీల్లో కారులో రూ.89,500 పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని దురాజ్‌పల్లి జంక్షన్‌లో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న మూడు వాహనాల్లో రూ.3.75 లక్షలను స్వాధీనం చేసుకుని అధికారులకు అప్పజెప్పారు. ఆత్మకూరు ఎస్‌ మండలం నెమ్మికల్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న అధికారులు హుజూర్‌నగర్‌కు చెందిన కొప్పుల సైదులు కారులో 1.85లక్షలను స్వాధీనం చేసుకుని కలెక్టర్‌కు అప్పజెప్పారు.నల్లగొండ జిల్లా అనుముల మండల కేంద్రంలోని హాలియా పాత ఐటీ సమీపంలో ఆర్టీసీ బస్సులో రూ.30 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవరకొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 30 లక్షల రూపాయలను సీజ్‌ చేసినట్టు హాలియా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శోభన్‌ బాబు తెలిపారు. మిర్యా లగూడ పట్టణంలోని సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం వద్ద సరైన శ్రీనివాస రంగారావు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై రూ.3.50 లక్షలతో వెళ్తుండగా వన్‌ టౌన్‌ సీఐ రాఘవేంద్ర స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల అధికారి బి.చెన్నయ్య తెలిపారు. వాడపల్లి ఎస్‌ఐ వాహన తనిఖీలు చేస్తుండగా కోటేశ్వరరావు వద్ద రూ.2లక్షలు పట్టుబడింది. నగదును ఆర్డీఓ, రిటర్నింగ్‌ అధికారి చెన్నయ్యకు అప్పగించారు.నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని గోసంపల్లె గ్రామంలో అక్రమంగా మద్యం నిల్వ ఉన్నట్టు వచ్చిన విశ్వాసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 193లీటర్ల మద్యాన్ని పట్టుకున్నట్టు ఎస్‌ఐ లింబాద్రి తెలిపారు. దీని విలువ రూ.లక్ష ఉంటుందన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంక్‌ సమీపంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేయగా, ఇద్దరు వ్యక్తుల వద్ద రెండు లక్షల నగదు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు.ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలోని రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా లక్ష రూపాయలు పట్టుబడ్డాయి. ముదిగొండలో రూ.1.57 లక్షలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 1.20 లక్షల నగదు పట్టుబడింది. కరీంనగర్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ముగ్ధుంపూర్‌ వద్ద ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్ట్‌ దగ్గర వాహనాల తనిఖీ నిర్వహించారు. వాహనాల తనిఖీని పోలీస్‌ కమిషనర్‌ ఎల్‌.సుబ్బారాయుడు పరిశీలించారు. రూ.3 లక్షలు సీజ్‌ చేశారు.