దళితబంధుకు అనర్హుల ఎంపిక..

Selection of ineligible for Dalit Bandhu..– సర్పంచ్‌ని నిలదీసిన గ్రామస్తులు
– రోడ్డుపై బైటాయించిన మహిళలు
నవతెలంగాణ- ఆత్మకూరుఎస్‌
దళితబంధు పథకానికి అనర్హులను ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ బుధవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ఎస్‌ మండలం నెమ్మికల్‌ గ్రామంలో సర్పంచ్‌ను గ్రామస్తులు నిలదీశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. నెమ్మికల్‌ సర్పంచ్‌ గంపల సతీష్‌, ఉప సర్పంచ్‌ రేణికుంట్ల ఉపేందర్‌, వార్డు సభ్యులు కలిసి తమ అనుచరులు, బంధువులకే దళితబంధు ఇచ్చుకున్నారని ఆరోపించారు. గ్రామానికి వచ్చిన దళితబంధు 24 యూనిట్లుగా కేటాయించారని తెలిపారు. ఇందులో మాదిగలకు 12, మాలలకు 12 యూనిట్లుగా పంచుకున్నారన్నారు. దళితబంధు యూనిట్‌లని అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, భూములు కలిగి ఉండి, ఆర్థికంగా బలపడిన వారికే స్థానిక నాయకులు అందించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు ఈ కేటాయింపులో ఏం జరిగిందని సర్పంచ్‌ సతీష్‌ని అడగడానికి వెళ్లిన కొందరు దళితులను సర్పంచి కొడుకు నరేందర్‌ దుర్భాషలాడుతూ గంపల విజయరావుపై దాడి చేశారు. దీంతో ఆగ్రహించిన దళితులు సర్పంచ్‌ ఇంటిపై దాడి చేశారు. అనంతరం సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. తాము దళితబంధుకు పూర్తిగా అర్హులమని, న్యాయం చేయాలంటూ దళితులు సూర్యాపేట కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లారు.