సెలక్షన్‌ సస్పెన్స్‌!

– సోమవారం ఆసియా కప్‌ జట్టు ఎంపిక
– వరల్డ్‌కప్‌ జట్టుపైనా రానున్న స్పష్టత
– ఉత్కంఠ రేపుతున్న సెలక్షన్‌ కమిటీ భేటీ
ఐసీసీ టైటిల్‌ వేటలో దశాబ్ది నిరీక్షణకు తెరదించాలని భారత్‌ భావిస్తుంది. ఆతిథ్య జట్టుగా మళ్లీ ప్రపంచకప్‌ నెగ్గాలనే పట్టుదల టీమ్‌ ఇండియాలో కనిపిస్తుంది. కానీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నం.4 బ్యాటర్‌ ఎవరు? వికెట్‌ కీపర్‌, రెండో స్పిన్నర్‌ ఎవరనే కీలక ప్రశ్నలకు సమాధానం లేదు. 2019 వరల్డ్‌కప్‌లో నం.4 డైలామా భారత్‌ను దెబ్బతీయగా.. ఇప్పుడూ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రపంచకప్‌ ముంగిట వరల్డ్‌కప్‌ జట్టును ఆసియా కప్‌లో ప్రయోగించేందుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్‌ జట్టును సోమవారం ఎంపిక చేయనున్నారు.
2023 వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌, టికెటింగ్‌లో బీసీసీఐ తీవ్ర విమర్శల పాలైంది. మెగా ఈవెంట్‌కు 50 రోజుల కౌంట్‌డౌన్‌ మొదలైనా.. అభిమానులు టికెట్లు బుక్‌ చేసుకునే అవకాశం లేదు. మరోవైపు ప్రపంచకప్‌ను భారత జట్టును సంసిద్ధం చేయటంలోనూ బీసీసీఐ పూర్తిగా తేలిపోయింది. ప్రపంచకప్‌ సమీపిస్తున్నా.. గెలుపు గుర్రాలను ఎంపిక చేయటం అటుంచి.. కనీసం తుది జట్టు కూర్పు కుదిరేట్టు ఓ కాంబినేషన్‌ను సైతం సిద్ధం చేయలేకపోయింది. కీలక స్థానాల్లో ఆడే క్రికెటర్లు ఎవరనే ప్రశ్నకు సమాధానమే లభించటం లేదు. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ ఆల్‌ ఇండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ సోమవారం న్యూఢిల్లీలో సమావేశం కానుంది. ప్రపంచకప్‌ జట్టుపైనా ఈ సమావేశంలోనే చర్చించనున్నారు. దీంతో సోమవారం నాడు సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అసలు చర్చ ఆ జట్టుపైనే!
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌పై సరైన సన్నద్ధత, ప్రణాళిక లేకుండా పోయావని బోర్డు విమర్శలు ఎదుర్కొంటుంది. ప్రపంచకప్‌లో పోటీపడే జట్టు ముందుగా కనీసం ఒక టోర్నీలోనైనా కలిసి ఆడే అవకాశం ఇవ్వరా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీంతో ఆసియా కప్‌ వేదికగా వరల్డ్‌కప్‌ జట్టును పరిక్షీంచేందుకు బోర్డు సిద్ధమవుతోంది. ప్రపంచకప్‌ ముసాయిదా జట్టును ప్రకటించేందుకు సెప్టెంబర్‌ 5 తుది గడువు. దీంతో సోమవారం నాటి సమావేశంలోనే ప్రపంచకప్‌ జట్టుపైనా చర్చ జరుగనుంది. ఈ భేటీకి భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌లు సైతం హాజరు కానున్నారు. ఐర్లాండ్‌ పర్యటనలో ఉన్న ఓ సెలక్టర్‌ ఎస్‌ఎస్‌ దాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశంలో భాగం కానున్నాడు. ప్రపంచకప్‌కు ఎంపిక చేసే 15 మందినే ఆసియా కప్‌కు సైతం పంపాలనే ఆలోచ నలో జట్టు మేనేజ్‌మెంట్‌, సెలక్షన్‌ కమిటీ ఉన్నాయి.
ఆ ముగ్గురు వస్తారా..?
కెఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా. ప్రపంచకప్‌ జట్టు ఎంపికకు ముందు సెలక్షన్‌ కమిటీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సందిగ్థం. గాయం నుంచి కోలుకుని మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తున్న ఈ ముగ్గురు ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటే జట్టులో చోటు ఖాయం. ఐర్లాండ్‌ పర్యటనలో బుమ్రా మెరిసినా.. వన్డేల్లో వరుస స్పెల్స్‌లో 4-5 ఓవర్లు వేయటం టీ20లకు భిన్నమైన సవాల్‌. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ ఎన్‌సీఏ ప్రాక్టీస్‌ గేమ్‌లో ఆకట్టుకున్నాడు. 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్‌, 38 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేశాడు. ఆదివారం జరిగే మరో ప్రాక్టీస్‌ గేమ్‌లో కెఎల్‌ రాహుల్‌ సైతం బ్యాట్‌ పట్టనున్నాడు. ఎన్‌సీఏ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈ ఇద్దరి మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. శ్రేయస్‌ అయ్యర్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే భారత్‌ ఎదుర్కొంటున్న నం.4 డైలామాకు తెర పడుతుంది. కెఎల్‌ రాహుల్‌కు గ్రీన్‌ సిగల్‌ లభిస్తే.. వికెట్‌ కీపర్‌ సహా లోయర్‌ ఆర్డర్‌లో ఫినీషర్‌ కొరత తీరుతుంది. ఒకవేళ ఈ ఇద్దరిలో ఎవరు ఫిట్‌నెస్‌ సాధించకపోయినా.. జట్టు కష్టాలు పడాల్సిందే. బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్పుల నుంచి.. ఇప్పటికిప్పుడు కుర్రాళ్లకు నయా సవాళ్లకు సిద్ధం చేయక తప్పదు. ఆ తలనొప్పి నుంచి తప్పించేందుకు ఎన్‌సీఏ కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై వంద శాతం ప్రయత్నం చేస్తుంది.
బంతితోనూ తిప్పలే
బౌలింగ్‌ విభాగంలో ఆటగాళ్లపైనా ఇప్పటివరకు స్పష్టత లేదు. జశ్‌ప్రీత్‌ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌పై ఇప్పటికే ఓ నిర్థారణకు రాలేం. ప్రసిద్‌ కృష్ణ జట్టు ప్రణాళికల్లో భాగం. అతడూ ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంది. మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమి, శార్దుల్‌ ఠాకూర్‌ మాత్రమే సిద్ధంగా ఉన్నారు. ఉపఖండ పిచ్‌లపై పేస్‌ ఆల్‌రౌండర్‌ పాత్ర పెద్దగా ఉండదు. దీంతో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వేటలోనే భారత్‌ కనిపిస్తుంది. ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను తిరిగి తీసుకోవాలనే చర్చ నడుస్తుంది. కుల్దీప్‌, చాహల్‌ మెరుస్తున్నా.. ఎడమ చేతి వాటం బ్యాటర్లపై సంప్రదాయ ఆఫ్‌ స్పిన్‌ ప్రభావం తోసిపుచ్చలేం. ఆసియా కప్‌ తర్వాత జట్టులో మార్పులు ఉండకూడదని భావిస్తున్న తరుణంలో.. సోమవారం భేటిలో సెలక్షన్‌ కమిటీ నిర్ణయాలపై ఆసక్తి కనిపిస్తుంది.
ఆసియా కప్‌లో భారత్‌ టైటిల్‌ వేటను సెప్టెంబర్‌ 2న పాకిస్థాన్‌తో పోరుతో షురూ చేయనుంది. సెప్టెంబర్‌ 4న నేపాల్‌తో ఢకొీట్టనుంది. ఈ రెండు మ్యాచులు పల్లెకల్‌లోనే జరుగుతాయి. ఆ తర్వాత సూపర్‌ 4, ఫైనల్‌ ఉంటాయి. ఆసియా కప్‌ అనంతరం స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో రోహిత్‌సేన తలపడనుంది. ప్రపంచకప్‌లోనూ అక్టోబర్‌ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో పోరుతోనే దండయాత్ర మొదలుపెట్టనుంది.
జైషాతో ద్రవిడ్‌ భేటీ
టీమ్‌ ఇండియా చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, బీసీసీఐ కార్యదర్శి జై షా సమావేశం క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కరీబియన్లతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా భారత జట్టు ఫ్లోరిడాలో ఉండగా.. అదే సమయంలో జై షా సైతం ప్రయివేటు పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రస్తుత టీమ్‌ ఇండియా పురోగతి, ప్రపంచకప్‌ ప్రణాళికలు, కీలక మ్యాచుల్లో పరాజయాలపై గల కారణాలపై రాహుల్‌ ద్రవిడ్‌ను జై షా ఆరా తీసినట్టు తెలుస్తుంది. ప్రపంచ కప్‌ ప్రణాళికలను సైతం రాహుల్‌ ద్రవిడ్‌ పంచుకున్నట్టు తెలుస్తుంది. ఈ భేటిపై బీసీసీఐ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక ఐర్లాండ్‌తో తొలి టీ20 అనంతరమే ఆసియా కప్‌ జట్టును ప్రకటించాలని తొలుత భావించినా.. వర్షం అంతరాయం కలిగించటంతో పూర్తి మ్యాచ్‌ సాధ్యపడలేదు. దీంతో రెండో టీ20 అనంతరం సెలక్షన్‌ కమిటీ సమావేశం అవుతుంది.